World Cup Final 2023 : IND VS AUS మ్యాచ్ ఫీవర్... మోదీ స్టేడియం కంటే ఏపీలోనే ఎక్కువమంది ఫ్యాన్స్ తో...(వీడియో)
ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచులన్నీ మీరు ఇళ్లలో కుటుంబసభ్యులు లేదంటే స్నేహితులతో కలిసి చూసారా..? అయితే ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ను సరికోొత్తగా ఆస్వాదించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సరికొత్త ఏర్పాట్లు చేసింది. మీరూ ఆ క్రికెట్ మజాను పొందండి.
అమరావతి : టీమిండియా ఏదైనా నార్మల్ మ్యాచ్ ఆడుతుంటేనే క్రికెట్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా వుండదు. అలాంటిది స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్... అందులోనూ ఫైనల్ మ్యాచ్... ఇంకేముంది భారత క్రికెట్ ఫ్యాన్స్ జోష్ మామూలుగా వుండదు. ఇలా సమఉజ్జీలు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశం వుంది. దీంతో దేశాన్ని క్రికెట్ ఫీవర్ కుదిపేస్తోంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఫైనల్ ను కూడా సాధారణ మ్యాచ్ లానే కాకుండా సరికొత్తగా చూడాలనుకునే క్రికెట్ ఫ్యాన్స్ కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) గుడ్ న్యూస్ చెప్పింది.
ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచులన్నీ మీరు ఇళ్లలో కుటుంబసభ్యులు లేదంటే స్నేహితులతో కలిసి చూసివుంటారు. కానీ ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం అలాకాదు... వందలాదిమందితో కలిసి స్టేడియంలో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కల్పించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఏసిఏ బిగ్ స్క్రీన్లు ఏర్పాటుచేసింది. వందలాదిమందితో కలిసి మ్యాచ్ వీక్షించే అవకాశాన్ని ఏపీలోని క్రికెట్ ఫ్యాన్స్ ను కల్పిస్తోంది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్.
వీడియో
ఇప్పటికే ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇలాగే పలు పట్టణాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటుచేసింది ఏసిఏ. విశాఖపట్నంతో పాటు విజయవాడ, కడపలో ఏర్పాటుచేసిన బిగ్ స్క్రీన్ల లో మ్యాచ్ వీక్షించిన అభిమానులు సరికొత్త అనుభూతిని పొందారు. దీంతో ఫైనల్ మ్యాచ్ అనుభూతిని మరింత ఎక్కువమందికి అందించే ఉద్దేశ్యంతో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటుచేసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వం అన్ని అనుమతులిచ్చి సహకరించిందని ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన బిగ్ స్క్రీన్ల ద్వారా రాష్ట్రంలోని 3 నుండి 4 లక్షలమంది ఇండియా-ఆసిస్ ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశాలున్నాయని ఏసిఏ కార్యదర్శి వెల్లడించారు. అంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేవారి కంటే ఏపీలో ఏర్పాటుచేసిన బిగ్ స్క్రీన్ల ద్వారా వీక్షించేవారే ఎక్కువ అన్నమాట. ఒకేచోట వందలాదిమంది కూర్చుని మ్యాచ్ ను ఆస్వాదించవచ్చని ఏసిఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు.
ఇదిలావుంటే విశాఖపట్నంలోని క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఇవాళ పండగ చేసుకోనున్నారు. సముద్ర ఒడ్డున... అలల సవ్వడి మధ్య వరల్డ్ కప్ ఫైనల్ చూసే అవకాశం వారికి దక్కుతోంది. బీచ్ రోడ్డులో ఏర్పాటుచేస్తున్న బిగ్ స్క్రీన్ లో విశాఖవాసులు ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించనున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో అభిమానుల కోసం బిగ్ స్క్రీన్ల ఏర్పాటు పూర్తయ్యిందని ఏసిఏ అధికారులు తెలిపారు.