ICC World cup 2023: సెంచరీలు మిస్ చేసుకున్న కోహ్లీ, శుబ్‌మన్ గిల్! వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా..
India vs Sri Lanka: రెండో వికెట్‌కి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్... 92 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్, 88 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అవుట్..
ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఓ భారీ భాగస్వామ్యం తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది. తొలి బంతికి ఫోర్ బాదిన రోహిత్ శర్మ, రెండో బంతికి అవుట్ అయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఏషియాలో 8 వేల వన్డే పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో 8వ సారి 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివరిగా 2019లో వన్డేల్లో 1377 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మూడేళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లో 1000+ పరుగులు చేసి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు..
టీమిండియా తరుపున అత్యధిక సార్లు ఏడాదిలో 1000+ వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 7 సార్లు, సౌరవ్ గంగూలీ 6 సార్లు, రోహిత్ శర్మ 5 సార్లు ఈ ఫీట్ సాధించి... విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు..
ఓవరాల్‌గా అత్యధిక సార్లు ఏడాదిలో 1000+ వన్డే పరుగులు చేసిన బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీయే. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన నాన్-ఓపెనర్‌గానూ చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ.
92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మధుశంక బౌలింగ్‌లో కుసాల్ మెండిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మధుశంక బౌలింగ్‌లోనే నిశ్శంకకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా కుమార సంగర్కర రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 145 సార్లు 50+ స్కోర్లు చేసి టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ, కుమార సంగర్కర 118 సార్లు వన్డేల్లో 50+ మార్కు దాటారు.