Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: ఆస్ట్రేలియాకి వరుసగా రెండో పరాభవం... సౌతాఫ్రికా చేతిలో చిత్తు..

సౌతాఫ్రికా చేతుల్లో 134 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆసీస్‌కి వరుసగా రెండో ఓటమి.. వరుసగా రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికాకి ఘన విజయం.. 

ICC World cup 2023: South Africa beats Australia, Second consecutive loss for Pat Cummins team CRA
Author
First Published Oct 12, 2023, 9:37 PM IST

వరల్డ్ కప్ టైటిల్ ఫెవరెట్‌ ఆస్ట్రేలియాకి ప్రపంచ కప్‌లో వరుసగా రెండో పరాభవం ఎదురైంది. టీమిండియా చేతుల్లో 199 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 312 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 40.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది..

15 బంతుల్లో 7 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసి రబాడా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. ఓ ఫోర్ బాది 5 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్, రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 17 బంతులు ఆడి 3 పరుగులు మాత్రమే చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఓ ఫోర్ బాది 5 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్, రబాడా బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా మరోసారి డీఆర్‌ఎస్ తీసుకున్న సఫారీ జట్టుకి స్టోయినిస్ వికెట్ దక్కింది.

70 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. 1983 తర్వాత 70 పరుగుల లోపు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోవడం వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇదే తొలిసారి.  మార్నస్ లబుషేన్, మిచెల్ స్టార్క్ కలిసి ఏడో వికెట్‌కి 99 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆసీస్‌ని ఆదుకునే ప్రయత్నం చేశారు. 51 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో పాతుకుపోయిన మార్నస్ లబుషేన్, 74 బంతుల్లో 3 ఫోర్లతో 46 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. . 

ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా కలిసి 9వ వికెట్‌కి 35 బంతుల్లో 32 పరుగులు జోడించారు. 21 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్, షంషీ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. జోష్ హజల్‌‌వుడ్ కూడా 2 పరుగులు చేసి అదే ఓవర్‌లో అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి తెరపడింది. 


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వింటన్ డి కాక్ 109 పరుగులు చేసి, వరల్డ్ కప్‌లో రెండో సెంచరీ చేశాడు. అయిడిన్ మార్క్‌రమ్ 56 పరుగులు చేయగా సఫారీ కెప్టెన్ తెంబ భవుమా 35, వాన్ దేర్ దుస్సేన్ 26, హెన్రీచ్ క్లాసిన్ 29 పరుగులు చేశారు.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios