India vs Pakistan: 16 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్... షాహీన్ ఆఫ్రిదీకి తొలి వికెట్.. 

అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రీఎంట్రీ హీరో శుబ్‌మన్ గిల్ పెద్దగా మెరుపులు మెరిపించకుండానే అవుట్ అయ్యాడు. తొలి బంతి ఫోర్ బాది, ఇన్నింగ్స్‌ని ఘనంగా మొదలెట్టాడు రోహిత్ శర్మ. శుబ్‌మన్ గిల్ కూడా తాను ఎదుర్కొన్న మొదటి బంతికి ఫోర్ బాదాడు. హసన్ ఆలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన శుబ్‌మన్ గిల్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

11 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, బౌండరీ బాదేందుకు ప్రయత్నించి షాదబ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా... ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.2లో ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో 70+ పరుగులు చేసి ఉంటే.. నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలిచి ఉండేవాడు..

హారీస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో 2 ఫోర్లు బాదాడు రోహిత్ శర్మ. 4 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది భారత జట్టు.. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, 42.5 ఓవర్లలో 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 50 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 49 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు. ఒకానొక దశలో 155/2 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించిన పాకిస్తాన్, 36 పరుగుల తేడాలో ఆఖరి 8 వికెట్లు కోల్పోయింది..