సారాంశం

South Africa vs Netherlands: 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల మంచి స్కోరు చేసిన నెదర్లాండ్స్... 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్... 

వన్డే వరల్డ్ కప్ 2023  టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌‌లో పసికూన నెదర్లాండ్స్ బ్యాటింగ్‌లో చక్కగా రాణించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్, 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల మంచి స్కోరు చేయగలిగింది..

ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ 16 బంతులు ఆడి 2 పరుగులు చేసి అవుట్ కాగా మ్యాక్స్ ఓడాడ్ 18, కోలిన్ అకీర్‌మన్ 13, బస్ దే లీడే 2, సేబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ 19, తేజ నిడమనురు 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు..

అయితే ఓ ఎండ్‌లో కుదురుకుపోయిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్,  లోగన్ వాన్ బ్రీక్‌తో కలిసి ఏదో వికెట్‌కి 28 పరుగులు, రోలోఫ్ వాన్ డెర్ మెర్వేతో కలిసి 8వ వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు..

లోగన్ వాన్ బ్రీక్ 10 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లుంగి ఎంగిడి బౌలింగ్‌‌లో అవుట్ అయ్యాడు..

స్కాట్ ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్యన్ దత్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లు ఏకంగా 31 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో అదనంగా అందించారు. ఇందులో 21 వైడ్లు ఉండడం విశేషం. 

2 వికెట్లు తీసిన లుంగి ఎంగిడి, 10 వైడ్లు వేశాడు. మార్కో జాన్సెన్, కగిసో రబాడా కూడా రెండేసి వికెట్లు తీశారు. గెరాల్డ్, కేశవ్ మహరాజ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.