ICC World cup 2023: క్వింటన్ డి కాక్ సెంచరీ, మార్క్‌రమ్ హాఫ్ సెంచరీ... అయినా ఆసీస్ ముందు..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసిన క్వింటన్ డి కాక్.. హాఫ్ సెంచరీ చేసిన అయిడిన్ మార్క్‌రమ్.. ఆస్ట్రేలియా ముందు 312 పరుగుల టార్గెట్.. 

ICC World cup 2023: Quinton De Kock another Century, Markram half century, South Africa scored CRA

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 84 బంతుల్లో సెంచరీ బాదిన క్వింటన్ డి కాక్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగించాడు. క్వింటన్ డి కాక్ సెంచరీకి తోడు అయిడిన్ మార్క్‌రమ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా మిగిలిన బ్యాటర్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు.. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగుల స్కోరు చేసింది...

ఆరంభం నుంచి క్రీజులో నిలదొక్కుకోవడానికి తెగ ఇబ్బంది పడిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా, 55 బంతుల్లో 2 ఫోర్లతో 35 పరుగులు చేసి గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 108 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా..

రస్సీ వాన్ దుస్సేన్ 30 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 109 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్వింటన్ డి కాక్ వన్డే కెరీర్‌లో ఇది 19వ సెంచరీ..

అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్ కలిసి నాలుగో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

ప్యాట్ కమ్మిన్స్ వేసిన 49వ ఓవర్‌లో ఆస్ట్రేలియా ఫీల్డర్లు రెండు ఈజీ క్యాచులను డ్రాప్ చేశారు. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్కో జాన్సెన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి అవుట్ అయ్యాడు..

13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్‌ని మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్, లెగ్ బై రూపంలో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios