అనుకున్నదంతా అయ్యింది! పాక్‌కి కలిసి వచ్చిన లక్... వర్షంతో రద్దైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి..
వర్షం కారణంగా పూర్తిగా సాగని పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్... డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్‌పై 21 పరుగుల తేడాతో నెగ్గిన పాకిస్తాన్..
పసికూనలపైన ప్రతాపం చూపించే పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి అదృష్టం కాస్త ఎక్కువే. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఫ్లాప్ అయిన తర్వాత కూడా న్యూజిలాండ్‌పై లక్కీగా విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. బౌలర్లు అట్టర్ ఫ్లాప్ కావడంతో 401 పరుగుల భారీ స్కోరు సమర్పించినా వరుణుడి రూపంలో అదృష్టం నడిచి రావడంతో న్యూజిలాండ్‌పై డక్ వర్త్ లూయిస్ విధానంలో విజయం అందుకుంది పాకిస్తాన్...
బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యఛేదనలో 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్.. 9 బంతుల్లో 4 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్‌ని టిమ్ సౌథీ అవుట్ చేశాడు.
అయితే ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్ కలిసి రెండో వికెట్‌కి అజేయంగా 141 బంతుల్లో 194 పరుగులు జోడించారు. 63 బంతుల్లో సెంచరీ అందుకున్న ఫకార్ జమాన్, వన్డే వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పాకిస్తాన్ బ్యాటర్‌గా నిలిచాడు. వర్షం కారణంగా తొలుత ఆట నిలిచే సమయానికి 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది పాకిస్తాన్.
గంట సేపు విరాటం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 41 ఓవర్లలో పాక్ లక్ష్యాన్ని 342 పరుగులుగా నిర్ణయించారు. ఇష్ సోదీ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో బాబర్ ఆజమ్ రెండు ఫోర్లు బాదగా, ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో బాబర్ ఓ సిక్సర్, ఫకార్ జమాన్ రెండు సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టారు.
వర్షం బ్రేక్ తర్వాత 4 ఓవర్లు కూడా ఆట సాగకుండానే వాన తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి కుండపోత వర్షం కురవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ని విజయం వరించింది. 401 పరుగుల భారీ స్కోరు చేసినా, రచిన్ రవీంద్ర రికార్డు సెంచరీతో చెలరేగినా.. కేన్ విలియంసన్ గాయంతో బాధపడుతూనే 95 పరుగులు చేసినా... లక్ కలిసి రాక కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి పాలైంది..
81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 126 పరుగులు చేసిన ఫకార్ జమాన్ ధనాధన్ సెంచరీ, పాక్ విజయంలో కీ రోల్ పోషించింది. 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ నాటౌట్‌గా నిలిచాడు.