Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: బంగ్లాపై ప్రతాపం చూపించిన పాకిస్తాన్... వరుస ఓటముల తర్వాత కమ్‌బ్యాక్..

Bangladesh vs Pakistan: 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం... 68 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్,  81 పరుగులు చేసిన ఫకార్ జమాన్.. 

ICC World cup 2023: Pakistan beats Bangladesh after consecutive losses CRA
Author
First Published Oct 31, 2023, 8:38 PM IST | Last Updated Oct 31, 2023, 8:38 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత పాకిస్తాన్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇప్పటికే 5 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌పై వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది పాకిస్తాన్. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకి ఆలౌట్ కాగా ఈ లక్ష్యాన్ని 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది పాకిస్తాన్..

205 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌కి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు. అబ్దుల్లా షెఫీక్, ఫకార్ జమాన్ కలిసి తొలి వికెట్‌కి 128 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

16 బంతుల్లో ఓ ఫోర్‌ బాది 9 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. నిరాశపరిచాడు. నాలుగు మ్యాచుల తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన ఫకార్ జమాన్ 74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేసి అదరగొట్టాడు. సెంచరీకి చేరువైన ఫకార్ జమాన్‌ని మెహిదీ హసన్ మిరాజ్ అవుట్ చేశాడు.

అయితే అప్పటికే విజయానికి చాలా దగ్గరగా వచ్చేసింది పాకిస్తాన్. మహ్మద్ రిజ్వాన్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు, ఇఫ్తికర్ అహ్మద్ 15 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ని పాకిస్తాన్ బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. తన్జీద్ హసన్ డకౌట్ కాగా నజ్ముల్ హుస్సేన్ షాంటో 4, ముస్తాఫికర్ రహీం 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  లిటన్ దాస్ 45, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 43, మహ్మద్దుల్లా 56 పరుగులు, మెహిదీ హసన్ మిరాజ్ 25 పరుగులు చేసి రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిదీ, మహ్మద్ వసీం జూనియర్ మూడేసి వికెట్లు తీయగా హారీస్ రౌఫ్‌కి 2 వికెట్లు దక్కాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios