ICC World cup 2023: న్యూజిలాండ్ జైత్రయాత్ర... ఆఫ్ఘాన్‌ని ఓడించి, వరుసగా నాలుగో విజయం..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్... 149 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో న్యూజిలాండ్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా చెన్నైలో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్, వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.. 289 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆఫ్ఘాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆఫ్ఘాన్, ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగుతున్నట్టు కనిపించలేదు. రెహ్మనుల్లా గుర్భాజ్ 11, ఇబ్రహీం జాద్రన్ 14, హస్మతుల్లా షాహిదీ 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్.
రెహ్మత్ షా, అజ్మతుల్లా ఓమర్‌జాయ్ కలిసి నాలుగో వికెట్‌కి 54 పరుగులు జోడించారు. రెహ్మత్ షా 36, అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 27 పరుగులు చేయగా మహ్మద్ నబీ 7 పరుగులు, రషీద్ ఖాన్ 8 పరుగులు, ముజీబ్ 4 చేసి అవుట్ అయ్యారు. నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ డకౌట్ కావడంతో ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 288 పరుగుల భారీ స్కోరు చేసింది.. ఒకే పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ని కెప్టెన్ టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఆదుకున్నారు..
18 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన డివాన్ కాన్వేని ముజీబ్ వుర్ రహీమ్ అవుట్ చేశాడు. 109/1 స్కోరుతో ఉన్న న్యూజిలాండ్, వరుసగా 3 వికెట్లు కోల్పోయి 110/4 స్థితికి చేరుకుంది. కేన్ విలియంసన్ ప్లేస్‌లో వచ్చిన విల్ యంగ్, 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.
41 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, అజ్మతుల్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 బంతులాడి 1 పరుగు చేసిన డార్ల్ మిచెల్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ దశలో టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఐదో వికెట్‌కి 144 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు..
80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్, నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో టామ్ లాథమ్ కూడా బౌల్డ్ అయ్యాడు. 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు టామ్ లాథమ్..