సారాంశం

Bangladesh vs Pakistan: 45.1 ఓవర్లలో 204 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. 45 పరుగులు చేసిన లిటన్ దాస్, 56 పరుగులు చేసిన మహ్మద్దుల్లా, 43 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షకీబ్ అల్ హసన్.. 

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, 45.1 ఓవర్లలో 204 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

తన్జీద్ హసన్ 5 బంతులు ఆడి షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. నజ్ముల్ హసన్ షాంటో 4 పరుగులు చేసి షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్ కాగా ముస్తాఫిజుర్ రహీం 5 పరుగులు చేశాడు. 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్..

ఈ దశలో లిటన్ దాస్, మహ్మద్దుల్లా కలిసి నాలుగో వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 64 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసిన లిటన్ దాస్, ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 70 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన మహ్మద్దుల్లాని షాహీన్ ఆఫ్రిదీ క్లీన్ బౌల్డ్ చేశాడు..

తోహిద్ హృదయ్ 7 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. మెహిదీ హసన్ మిరాజ్ 30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా టస్కిన్ అహ్మద్ 6, ముస్తాఫికర్ రెహ్మాన్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిదీ 9 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహ్మద్ వసీం జూనియర్ 8.1 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్‌లకు చెరో వికెట్ దక్కగా హారీస్ రౌఫ్ 2 వికెట్లు తీశాడు.