ICC World cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. శుబ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్.. 

చెన్నైలో ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఫీల్డింగ్ చేయనుంది. డెంగ్యూ బారిన పడిన టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నేటి మ్యాచ్‌లో ఆడడం లేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నాడు. 

టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలతో పాటు రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కింది. హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరిస్తారు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతని స్థానంలో మార్నస్ లబుషేన్ నేటి మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నాడు.. 

వరల్డ్ కప్ మ్యాచ్‌కి కెప్టెన్సీ చేస్తున్న అతి పెద్ద వయస్కుడైన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. రోహిత్ వయసు 36 ఏళ్ల 161 రోజులు కాగా ఇంతకుముందు 1999 వన్డే వరల్డ్ కప్‌లో 36 ఏళ్ల 124 రోజుల వయసులో మహ్మద్ అజారుద్దీన్, టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కామెరూన్ గ్రీన్ గాయపడడంతో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా టీమ్‌లోకి వచ్చిన మార్నస్ లబుషేన్, అద్భుతంగా ఆడి... వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్నాడు. ట్రావిస్ హెడ్ గాయపడడంతో అతని స్థానంలో లబుషేన్, ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని కొట్టేశాడు..

అటు రోహిత్ శర్మకు, ఇటు ప్యాట్ కమ్మిన్స్‌కి కెప్టెన్‌గా ఇదే మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్. ఇండియా- ఆస్ట్రేలియా మధ్య ఇది 150వ వన్డే మ్యాచ్. కేవలం శ్రీలంక (167 వన్డేలు) మాత్రమే, టీమిండియాతో ఆస్ట్రేలియా కంటే ఎక్కువ మ్యాచులు ఆడింది. 

ఆస్ట్రేలియ జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్, ఆడమ్ జంపా

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్