ICC World Cup 2023 : నేటి మ్యాచ్ కు ఆ ఆల్ రౌండర్ దూరం... రోహిత్ కీలక ప్రకటన
శ్రీలంకతో మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేసారు. ప్రపంచ కప్ లీగ్ మ్యాచులకు కీలక ఆల్ రౌండర్ పాండ్యా దూరమైనట్లేనని చెప్పకనే చెప్పారు కెప్టెన్.
హైదరబాద్ : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. టీమిండియా ఫ్యాన్స్ ను ఈ ప్రపంచ కప్ టోర్నీలో బాధ కలిగించిన విషయం ఏదైనా వుందంటే అది ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయమే. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన పాండ్యా ఇప్పటకే రెండు మ్యాచులకు దూరమయ్యారు. ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో పాండ్యా బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ భావించారు. వారి ఆశలపై నీళ్లుచల్లుతూ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేసారు.
ముంబై వాంఖడే స్టేడియంలో నేడు భారత్, శ్రీలంక తలపడనున్నాయి. మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై స్పందించారు. నేటి మ్యాచ్ కు కూడా పాండ్యా దూరంగానే వుండనున్నాడని ప్రకటించారు. తర్వాత సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు కూడా పాండ్యా అందుబాటులో వుండకపోవచ్చంటూ రోహిత్ వెల్లడించారు.
దాదాపు ప్రపంచ కప్ లీగ్ మ్యాచులకు పాండ్యా దూరమయ్యాడని రోహిత్ చెప్పకనే చెప్పారు. అయితే పాండ్యా గాయంనుండి వేగంగా కోలుకుంటున్నాడంటూ కెప్టెన్ పాజిటివ్ కామెంట్స్ కూడా చేసారు. త్వరలోనే హార్దిక్ ను తిరిగి భారత జట్టులో చూస్తామని రోహిత్ తెలిపాడు.
Read More వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ.. చూస్తే కళ్లు తిప్పుకోలేం..
బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా వుండటంతో అతడు కోలుకోడానికి సమయం పడుతోంది. దీంతో ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాడ్ తో మ్యాచులకు దూరమైన పాండ్యా నేడు శ్రీలంకతో కూడా ఆడటంలేదు.
బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత పాండ్యా ప్రాక్టీస్ కు పూర్తిగా దూరమయ్యాడు... పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే వరుస విజయాలతో టీమిండియా సెమీస్ బెర్త్ ఖాయమైన నేపథ్యంలో పాండ్యాను ఆడించి రిస్క్ చేయొద్దని మేనేజ్ మెంట్ భావిస్తోంది. అందుకోసమే లీగ్ మ్యాచులన్నింటికి పాండ్యాను దూరంపెట్టి కీలకమైన సెమీస్ లో ఆడించాలని భావిస్తున్నారు.