Asianet News TeluguAsianet News Telugu

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీరోచిత ‘డబుల్’ సెంచరీ... ఆఫ్ఘాన్‌పై ఆస్ట్రేలియా సంచలన విజయం..

వీరోచిత డబుల్ సెంచరీతో మ్యాచ్‌ని ముగించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... తొడ కండరాలు పట్టేసినా మొండిగా బ్యాటింగ్ కొనసాగించి ఆస్ట్రేలియాకి విజయం అందించిన మ్యాక్స్‌వెల్.. 

ICC World cup 2023: Glenn Maxwell heroic double century, Australia beats Afghanistan CRA
Author
First Published Nov 7, 2023, 10:21 PM IST | Last Updated Nov 7, 2023, 10:21 PM IST

292 పరుగుల టార్గెట్! 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఇక పసికూన ఆఫ్ఘాన్, సంచలన విజయం అందుకుంటుందని అనుకున్నారంతా! ఆఫ్ఘాన్ సెమీ ఫైనల్ చేరే ఛాన్సుల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ కూడా జరిగింది. అయితే ‘బిగ్ షో’ గ్లెన్ మ్యాక్స్‌వెల్, వీరోచిత డబుల్ సెంచరీతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మరో ఎండ్‌లో పాతుకుపోయి, మ్యాక్స్‌వెల్‌కి స్ట్రైయిక్ ఇస్తూ 202 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు..

128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేసి... అజేయ డబుల్ సెంచరీ బాదిన మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్‌పై విజయం అందుకుంది.. 68 బంతులు ఆడిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఒకే ఫోర్‌తో 12 పరుగులు చేశాడు.   

292 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్‌కి ఊహించని షాక్ తగిలింది. రెండో ఓవర్‌లో ట్రావిస్ హెడ్‌ని నవీన్ ఉల్ హక్ డకౌట్ చేశాడు. 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ కూడా నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించినా మిచెల్ మార్ష్ రివ్యూ తీసుకోకపోవడంతో ఆసీస్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది..

29 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అజ్మతుల్లా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి జోష్ ఇంగ్లీష్ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అజ్మతుల్లా బౌలింగ్‌లో సెంచరీ హీరో ఇబ్రహీం జాద్రాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జోష్ ఇంగ్లీష్.. 49 పరుగులకే 4 కీ వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా..

ఐదో వికెట్‌కి 20 పరుగులు జోడించిన మార్నస్ లబుషేన్, రనౌట్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ డైవ్ చేసినా రెహ్మత్ షా కొట్టిన డైరెక్ట్ హిట్ నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో 69 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆసీస్.. 

మార్కస్ స్టోయినిస్ 6, మిచెల్ స్టార్క్ 3 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ దశలో ఆసీస్ 150 కొట్టడమే కష్టమని అనుకున్నారంతా..

అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 27 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ అవుటైనట్టు అంపైర్ ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న ఆసీస్ బ్యాటర్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది..

33 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ ఇచ్చిన క్యాచ్‌ని  ముజీబ్ జారవిడిచాడు. రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆఫ్ఘాన్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు..

51 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొడ కండరాలు పట్టేసినా, నడవడానికి ఇబ్బంది పడుతున్నా మొండిగా బ్యాటింగ్ కొనసాగించిన మ్యాక్స్‌వెల్, 104 బంతుల్లో 150 పరుగుల మార్కు కూడా దాటేశాడు.. 128 బంతుల్లో డబుల్ సెంచరీ అందుకుని ముజీబ్ బౌలింగ్‌లో 6,6, 4, 6 బాది మ్యాచ్‌ని ముగించాడు.. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఇబ్రహీం జాద్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇబ్రహీం జాద్రాన్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios