సారాంశం

ICC World cup 2023 Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్... టీమిండియా తొలుత బ్యాటింగ్

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. అక్టోబర్ 5న ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేటితో ముగియనుంది.

ఇరు జట్లు కూడా చెన్నైలో 2023 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడడం విశేషం. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి టీమిండియాకి విజయాన్ని అందించారు..

తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా, వరుసగా 8 విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది. 2015 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, 2019 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఓడింది. 

ఇప్పటిదాకా 10 మ్యాచుల్లో గెలిచి అజేయంగా ఫైనల్‌కి వచ్చిన భారత జట్టు, 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలవాలని ఆశగా ఉంది. 2011 వన్డే వరల్డ్ కప్‌ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా 2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో సెమీ ఫైనల్‌లో ఓడింది..
 

రెండు జట్లు కూడా సెమీ ఫైనల్‌లో మార్పులు లేకుండా బరిలో దిగుతున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఇక్కడ జరిగిన మూడు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్లకే విజయం దక్కడం విశేషం... అయితే భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్స్ గెలిచిన 1983, 2011 వరల్డ్ కప్ టోర్నీల్లో టాస్ ఓడిపోవడం విశేషం..

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

 

ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీష్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్