ఇంగ్లాండ్‌కి మరో షాక్! సౌతాఫ్రికా చేతుల్లో చిత్తు... నాలుగింట్లో మూడో ఓటమి, ఇక సెమీస్ చేరాలంటే...
England vs South Africa: 400 పరుగుల లక్ష్యఛేదనలో 170 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్... 229 పరుగుల తేడాతో ఘోర ఓటమి! 43 పరుగులు చేసి పరువు కాపాడిన మార్క్ వుడ్..
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీని ఆరంభించిన ఇంగ్లాండ్‌కి వరుసగా రెండో షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిన ఇంగ్లాండ్, తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 400 పరుగుల లక్ష్యఛేదనలో 170 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్. మొదటి నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌కి ఇది మూడో ఓటమి. 169 పరుగులకి ఆఖరి స్థానంలో నిలవాల్సిన ఇంగ్లాండ్, 1 పరుగు ఎక్కువగా చేయడంతో 9వ స్థానంలో నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ నాకౌట్ స్టేజీకి అర్హత సాధించాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే..
400 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు అనిపించలేదు.ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టోని, లుంగి ఇంగిడి అవుట్ చేశాడు. జో రూట్ 2 పరుగులు, డేవిడ్ మలాన్ 6 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు..
ఆదుకుంటాడని అనుకున్న బెన్ స్టోక్స్ కూడా 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి కగిసో రబాడా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 7 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాది 15 పరుగులు, సౌతాఫ్రికాపై కౌంటర్ అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గెరాల్డ్ కాట్జే బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ కావడంతో 67 పరుగులకే సగం ఇంగ్లాండ్ టీమ్ పెవిలియన్‌కి చేరింది..
అదరగొడతాడని అనుకున్న యంగ్ బ్యాటర్ హారీ బ్రూక్ 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 68 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.
14 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన అదిల్ రషీద్, గెరాల్డ్ కాట్జే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 12 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు బాదిన డేవిడ్ విల్లే, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో మార్క్ వుడ్ కలిసి 33 బంతుల్లో 70 పరుగులు జోడించి, ఇంగ్లాండ్ పరువుని కాపాడారు. 21 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు చేసిన గుస్ అట్కీన్సన్‌ని కేశవ్ మహరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రీస్ తోప్లే గాయంతో బ్యాటింగ్‌కి రాకపోవడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేసిన మార్క్ వుడ్, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కాట్జేకి 3 వికెట్లు దక్కగా లుంగి ఇంగిడి, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు, కేశవ్ మహరాజ్ కగిసో రబాడా చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వింటన్ డి కాక్ 4 పరుగులు చేసి నిరాశపరిచినా రీజా హెండ్రిక్స్ 85, వాన్ దేర్ దుస్సేన్ 60, అయిడిన్ మార్క్‌రమ్ 42, మార్కో జాన్సెన్ 75 పరుగులు చేశాడు. హెన్రీచ్ క్లాసిన్ 67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి... సెంచరీ అందుకున్నాడు..