Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు! 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆఫ్ఘాన్‌ జోరుకి..

Afghanistan vs Australia: 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్... ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా టాపార్డర్ విలవిల.. 

ICC World cup 2023: Australia lost 5 early wickets, Afghanistan vs Australia CRA
Author
First Published Nov 7, 2023, 7:49 PM IST | Last Updated Nov 7, 2023, 7:49 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పసికూన ఆఫ్ఘాన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 291 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యం ఆసీస్‌కి పెద్ద కష్టమేమీ కాదని అనుకున్నారంతా. అయితే 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్... ఊహించని విధంగా కష్టాల్లో పడింది.

ట్రావిస్ హెడ్‌ని నవీన్ ఉల్ హక్ డకౌట్ చేశాడు. 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ కూడా నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించినా మిచెల్ మార్ష్ రివ్యూ తీసుకోకపోవడంతో ఆసీస్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది..

29 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అజ్మతుల్లా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి జోష్ ఇంగ్లీష్ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అజ్మతుల్లా బౌలింగ్‌లో సెంచరీ హీరో ఇబ్రహీం జాద్రాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జోష్ ఇంగ్లీష్.. 49 పరుగులకే 4 కీ వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా..

ఐదో వికెట్‌కి 20 పరుగులు జోడించిన మార్నస్ లబుషేన్, రనౌట్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ డైవ్ చేసినా రెహ్మత్ షా కొట్టిన డైరెక్ట్ హిట్ నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో 69 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆసీస్.. 

 అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 పరుగుల భారీ స్కోరు చేసింది. 25 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

44 బంతుల్లో ఓ ఫోర్‌తో 30 పరుగులు చేసిన రెహ్మత్ షా, మ్యాక్స్‌‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 43 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 18 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేయగా మహ్మద్ నబీ 10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన ఇబ్రహీం జాద్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇబ్రహీం జాద్రాన్..

ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ మ్యాచ్‌లో మూడో అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు ఇబ్రహీం జాద్రాన్. 
రషీద్ ఖాన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. క్రీజులోకి వచ్చిన ఆఫ్ఘాన్ బ్యాటర్లు అందరూ డబుల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశారు. జోష్ హజల్‌వుడ్ 2 వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలా ఓ వికెట్ తీశారు..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios