వన్డే వరల్డ్ కప్‌లో మరో సంచలనం... నెదర్లాండ్స్ చేతుల్లో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా..
నెదర్లాండ్స్ చేతుల్లో 38 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. 246 పరుగుల లక్ష్యఛేదనలో 207 పరుగులకు ఆలౌట్! 43 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్...
మొదటి రెండు మ్యాచుల్లో శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్స్ దుమ్ములేపిన సౌతాఫ్రికా ఓ వైపు, మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన నెదర్లాండ్స్ మరో వైపు... వరల్డ్ కప్ 2023లో ఈ మ్యాచ్ కూడా చప్పగా సాగి వన్‌సైడ్ అవుతుందని అనుకున్నారంతా. అయితే నెదర్లాండ్స్ సంచలన ఆటతీరుతో సౌతాఫ్రికాని ఓడించి, సంచలన విజయంతో వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది... 246 పరుగుల లక్ష్యఛేదనలో 42.5 ఓవర్లు ఆడి 207 పరుగులకి ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా..
246 పరుగుల లక్ష్యఛేదనని మెయిడిన్‌తో మొదలెట్టింది సౌతాఫ్రికా. అయితే రెండో ఓవర్‌లో ఖాతా తెరిచిన సౌతాఫ్రికా 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. 22 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని అకీర్‌మన్ అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది..
31 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా, వాన్ డేర్ మెర్వీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అయిడిన్ మార్క్‌రమ్, ఆ వెనకే వాన్ దేర్ దుస్సేన్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా..
డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసిన్ కలిసి ఐదో వికెట్‌కి 45 పరుగులు జోడించారు. కాస్త కోలుకుంటున్న సమయంలో క్లాసిన్ వికెట్ తీశాడు లోగన్ వాన్ బ్రీక్. 28 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, విక్రమ్‌జీత్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
25 బంతులు ఆడి 9 పరుగులు చేసిన మార్కో జాన్సెన్‌ని వాన్ మికీరన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోట్జీ కలిసి ఏడో వికెట్‌కి 36 పరుగులు జోడించారు. 23 పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డేవిడ్ మిల్లర్, 52 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసి వాన్ బ్రీక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
నెదర్లాండ్స్ 140 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోతే, సౌతాఫ్రికా 145 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. మిల్లర్ అవుట్ అయ్యే సమయానికి సౌతాఫ్రికా విజయానికి 72 బంతుల్లో 101 పరుగులు కావాలి..
23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన గెరాల్డ్ కోట్జీన బస్ దే లీడే అవుట్ చేయడంతో సౌతాఫ్రికా ఓటమి ఖరారైపోయింది. ఓ సిక్సర్ బాదిన కగిసో రబాడా 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే 3 ఓవర్లలో 62 పరుగులు కావాల్సి రావడంతో మ్యాచ్ గెలవడానికి అవకాశం కూడా లేకపోయింది. దీంతో కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి కలిసి ఆలౌట్ కాకుండా ఆడాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ చేశారు.
37 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన కేశవ్ మహరాజ్, ఇన్నింగ్స్ ముగియడానికి మరో బంతి ఉండగా అవుట్ కావడంతో సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది.
అంతకుముందు వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్, 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల మంచి స్కోరు చేయగలిగింది. 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్, ఆఖరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది.
కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్యన్ దత్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లు ఏకంగా 31 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో అదనంగా అందించారు. ఇందులో 21 వైడ్లు ఉండడం విశేషం. 2 వికెట్లు తీసిన లుంగి ఎంగిడి, 10 వైడ్లు వేశాడు.