Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన మార్క్‌రమ్! క్వింటన్ డి కాక్, దుస్సేన్ సెంచరీలు... శ్రీలంక ముందు కొండంత..

వన్డే వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన అయిడిన్ మార్క్‌రమ్... క్వింటన్ డి కాక్, రస్సీ వాన్ దే దుస్సన్ సెంచరీలు.. లంక ముందు 429 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా.. 

ICC World cup 2023: Aiden Markram Record breaking Ton, Quinton De Kock, Rassie van der Dussen innings CRA
Author
First Published Oct 7, 2023, 6:15 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ బాంగ్‌ బాంగ్ ఇన్నింగ్స్‌లతో మొదలెట్టింది. ఒకటికి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగిపోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 428 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన శ్రీలంక ముందు కొండంత టార్గెట్‌ని పెట్టింది..

కెప్టెన్ తెంప భవుమా 5 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. క్వింటన్ డి కాక్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కలిసి రెండో వికెట్‌కి 204 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు..

84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, మతీశ పథిరాణా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

అయితే నాలుగో స్థానంలో వచ్చిన అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్ కలిసి మరింత దూకుడుగా ఆడుతూ బౌండరీల మోత మోగించారు. హెన్రీచ్ క్లాసిన్ 20 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగుల చేసి రజిత బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అయిడిన్ మార్క్‌రమ్ మాత్రం ఎక్కడా దూకుడు తగ్గించలేదు.

49 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ బాదిన అయిడిన్ మార్క్‌రమ్, వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇంతకుముందు 2011లో ఇంగ్లాండ్‌పై 50 బంతుల్లో సెంచరీ చేసిన కెవిన్ ఓబెయ్రిన్, వన్డే వరల్డ్ కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...

వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి కాగా వరల్డ్ కప్‌లో మొదటిసారి. మొత్తంగా నాలుగు సార్లలో మూడు సార్లు సౌతాఫ్రికానే ఈ ఫీట్ సాధించడం విశేషం.. 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, మధుశనక బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

ఆఖర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్ కూడా చివరి 3 ఓవర్లలో 45 పరుగులు రాబట్టారు. డేవిడ్ మిల్లర్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేయగా మార్కో జాన్సర్ ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలోనూ ఇదే అత్యధిక టీమ్ స్కోరు. ఇంతకుముందు ఆస్ట్రేలియా, ఆఫ్ఘాన్‌పై చేసిన 417 పరుగుల స్కోరును దాటేసింది సౌతాఫ్రికా.. 

Follow Us:
Download App:
  • android
  • ios