ఐసిసి నిర్వహించే అతి ప్రతిష్టాత్మక టోర్నీ వన్డే ప్రపంచ కప్. అంతర్జాతీయ క్రికెట్ జట్లన్నింటిలో నుండి విశ్వవిజేత ఎవరో తేల్చే ఇలాంటి టోర్నీలో క్రికెటర్లపైనే కాకుండా అంపైర్లపైనా తీవ్ర ఒత్తిడి వుంటుంది. ఏదైనా నిర్ణయం అటుఇటైనా మ్యాచ్ ఫలితమే మారిపోతుంది. అలా ఇటీవల ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్   ఫైనల్లో అపైర్ ధర్మసేన తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయమే మ్యాచ్ ను మలుపుతిప్పింది. ఆ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారి అభిమానులు, క్రికెట్ పండితులు ధర్మసేనను అంపైరింగ్ బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేసే స్థాయికి చేరింది. దీంతో తాజాగా ధర్మసేన తాను తీసుకున్నఆ ఓవర్ త్రో  నిర్ణయం గురించి వివరణ ఇచ్చుకున్నాడు. 

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో తాను తీసుకున్న నిర్ణయం తప్పేనంటూ స్వయంగా ధర్మసేనే అంగీకరించారు. చివరి ఓవర్లలో ఓవర్ త్రోకు ఆరు పరుగులివ్వడం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చింది. ఇదే సమయంలో న్యూజిలాండ్ గెలుపు అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. అలా అంపైర్ గా తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆ మ్యాచ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే ఈ నిర్ణయం పట్ల మాత్రం తాను బాధపడటం లేదని ధర్మసేన తెలిపాడు.

తప్పే..కానీ చింతిచడం లేదు

అయితే అప్పటికప్పుడు ఎలాంటి సాంకేతికతను వినియోగించకుండా నిర్ణయం తీసుకోవాల్సి రావడమే తన తప్పుకు కారణమని అన్నాడు. మైదానంలో నుండి  బయటకు వచ్చి టీవి  రిప్లేలలో చూసే వరకు తాను ప్రకటించిన తప్పుడు నిర్ణయమని తెలియలేదు. ఆ సమయంలో ఏ అంపైర్ వున్నా తనలాగే చేసేవారని భావిస్తున్నాను. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో చాకచక్యంగా వ్యవహరించి అప్పటికప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఐసిసి నుండి ప్రశంసలు పొందినట్లు ధర్మసేన వెల్లడించాడు. 
 
స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ 2019  ద్వారా ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే లార్డ్స్ వేదికన న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మ్యాచ్, సూపర్ ఓవర్ కూడా టై కావడం...చివరకు బౌండరీల ద్వారా ఇంగ్లాండ్ విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఇంగ్లాండ్ ఇన్సింగ్స్ 49వ ఓవర్లో జరిగిన ఓ పరిణామం మ్యాచ్ ను ఇక్కడివరకు తీసుకువచ్చింది. ఈ ఓవర్లో స్టోక్స్‌ బ్యాట్‌ను తాకిన బంతి ఓవర్‌త్రోతో బౌండరీకి తరలింది. దీంతో అంపైర్‌ ధర్మసేన ఇంగ్లాండ్ కు మొత్తం 6 రన్స్‌ ఇవ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.