ICC Womens T20 World Cup: నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరివరకూ నిలిచి ఆఖర్లో రెచ్చిపోయిన జెమీమా ఆటతీరును చూసి  క్రికెట్ అభిమానులు  ఆ ఇన్నింగ్స్ ను   గతేడాది పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ఆడిన మ్యాజిక్ ఇన్నింగ్స్ తో పోలుస్తున్నారు.   

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు దాయాది పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా ముగిసిన ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. 38 బంతుల్లోనే 53 పరుగులతో నాటౌట్ గా నిలవడమే గాక భారత్ కు సూపర్ విక్టరీని అందించింది. పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచుతున్న వేళ.. ఆమె చూపిన తెగువ, చివరివరకూ నిలిచి ఆఖర్లో రెచ్చిపోయిన తీరును చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. జెమీమా ఇన్నింగ్స్ ను గతేడాది ఇదే పాకిస్తాన్ పై మెల్‌బోర్న్ వేదికగా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఆడిన మ్యాజిక్ ఇన్నింగ్స్ తో పోలుస్తున్నారు.

గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్ లో భాగంగా మెల్‌బోర్న్ లో పాకిస్తాన్ తో జరిగిన హై ఓల్టేజీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ.. 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 45 పరుగులకే భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో హార్ధిక్ పాండ్యాతో కలిసి అద్భుతం చేశాడు. 

చివరి మూడు ఓవర్లలో కోహ్లీ తన విశ్వరూపమే చూపాడు. 19వ ఓవర్ వేసిన హరీస్ రౌఫ్ బౌలింగ్ లో రెండు భారీ సిక్సర్లు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లోనే ఉన్నాయి. మ్యాచ్ చివరి ఓవర్లో ఓ సిక్స్.. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తుతూ భారత్ కు మరుపురాని విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఆ రేంజ్ లో కాకపోయినా అంతకు ఏ మాత్రం తీసిపోని విధంగా జెమీమా కూడా పోరాడింది.

Scroll to load tweet…

93కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో రిచా ఘోష్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివరి నాలుగు ఓవర్లలో 41 పరుగులు రావాల్సి ఉండగా జెమీమా.. రిచాలు అద్భుతమే చేశారు. పాక్ బౌలర్లను ఉతికారేశారు. ఫలితంగా భారత్ ఈ టోర్నీలో విజయ బోణీ చేయడంతో పాటు పాకిస్తాన్ పై టీ20లలో మనకు ఇదే అత్యుత్తమ ఛేదన. 

View post on Instagram

కాగా ఈ మ్యాచ్ లో జెమీమా ఆడిన పలు షాట్లు.. మెల్‌బోర్న్ లో కోహ్లీ ఆడిన షాట్లతో సరిపోల్చుతూ ఐసీసీ ఓ వీడియోను రూపొందించింది. పాకిస్తాన్ పై టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో భారత్ విక్టరీ అని ట్యాగ్ లైన్ పెట్టి వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను మీరూ చూసేయండి మరి..