ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. 68 పరుగులకే ఆలౌట్.. ట్రోఫీ ముంగిట షెఫాలీ సేన
ICC Under-19 T20 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న తొలి మహిళల ఐసీసీ అండర్ - 19 ప్రపంచకప్ అందుకోవడానికి షెఫాలీ సేన అడుగుదూరంలో నిలిచింది. బౌలర్ల విజృంభణతో ఇంగ్లాండ్ 68 పరుగులకే చిత్తైంది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళల అండర్ -19 క్రికెట్ ఫైనల్ లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఆటాడుకున్నారు. టీమిండియా బౌలర్ల విజృంభణతో గ్రేస్ స్క్రీవెన్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్.. 17.1 ఓవర్లలో 68 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టులో ర్యానా మెక్ డొనాల్డ్ (19) టాప్ స్కోరర్. బౌలింగ్ వేసిన ప్రతీ భారత బౌలర్ కు వికెట్ దక్కింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఫైనల్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్.. ఆది నుంచి ఒడిదుడుకులతోనే సాగింది. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు చేరగానే ఆ జట్టు ఓపెనర్ లిబర్టీ హీప్ (0) ను టిటాస్ సాధు ఔట్ చేసింది. స్కోరు బోర్డు 15 పరుగుల వద్ద నిమా హోలండ్ (10) ను అర్చనా దేవి క్లీన్ బౌల్డ్ చేసింది.
అదే జోష్ లో అర్చనా.. గ్రేస్ స్క్రీవర్స్ (4) కూడా పెవిలియన్ కు పంపింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో టిటాస్ సాధు.. వికెట్ కీపర్ సెరెన్ స్మేల్ (3) ను బౌల్డ్ చేసింది. ఆ తర్వాత పర్షవి చోప్రా.. చెయిర్స్ పవ్లే (2), ర్యానా మెక్ డొనాల్డ్ (19) ల పని పట్టింది. ఆ తర్వాత వచ్చిన లోయరార్డర్ బ్యాటర్లు కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు.
భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు.. 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాలో సాధు, అర్చనా దేవి, పర్షవి లకు తలా రెండు వికెట్లు దక్కాయి. షెఫాలీ వర్మ, మన్నత్ కశ్యప్, సోనమ్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 బంతుల్లోనే ఒక ఫోర్, ఒక సిక్సర్ తో ధాటిగా ఆడిన కెప్టెన్ షెఫాలీ.. 15 పరుగులు చేసి నిష్క్రమించింది. ప్రస్తుతం శ్వేతా సెహ్రావత్, సౌమ్య తివారి ఆడుతున్నారు.