Australia-W Breaks Team India's Record: ఏడో ప్రపంచకప్ కోసం అడుగులు వేస్తున్న  ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ఆ దిశగా మరో గెలుపును సొంతం చేసుకుంది.  మంగళవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ గెలిచిన అనంతరం ఆ జట్టు భారత పురుషుల జట్టు రికార్డును బ్రేక్ చేసింది. 

మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఆరు సార్లు విశ్వ విజేత ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. ఏడో సారి కప్ కొట్టాలనే తపనతో ఉన్న ఆసీస్ మహిళల జట్టు.. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్నది. మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆ జట్టు.. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో కూడా గెలిచి ఆరుకు ఆరు గెలిచింది. ఈ క్రమంలో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని టీమిండియా నెలకొల్పిన ఛేదనలో అత్యధిక విజయాల రికార్డును బద్దలు కొట్టింది. 

2005-06 లో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని భారత జట్టు.. ఛేదనలో వరుసగా 17 విజయాలు నమోదు చేసి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికాతో విజయం ఆ జట్టుకు ఛేదనలో వరుసగా 18వది కావడం గమనార్హం. 

2018 నుంచి లాగింగ్ బృందం ఛేదనలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ పేరిట ఉండేది. 2008-09 మధ్యకాలంలో ఇంగ్లాండ్ మహిళల జట్టు.. వరుసగా 15 మ్యాచులు గెలిచింది. 2015-17 మధ్య కాలంలో న్యూజిలాండ్ కూడా ఈ రికార్డు సాధించింది. 

Scroll to load tweet…

ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఆ జట్టులో వోల్వార్డ్ (90), కెప్టెన్ సునె (52), లీ (36) రాణించారు. అనంతరం 272 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ కు ఆశించిన ఆరంభం దక్కకపోయినా కెప్టెన్ మెగ్ లానింగ్ (130 బంతుల్లో 135 నాటౌట్) అద్భుత సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెకు మెక్ గ్రాత్ (32), ఆష్లే గార్డ్నర్ (22), సుదర్లాండ్ (22 నాటౌట్) లు సహకరించారు. దీంతో 45.2 ఓవర్లలోనే ఆసీస్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెంచరీతో మెరిసిన లాగింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Scroll to load tweet…

ప్రపంచకప్ లో ఆడిన ఆరింటికి ఆరు మ్యాచుల్లో గెలిచి ఇప్పటికే సెమీస్ చేరిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. టాప్ 4లో ఆసీస్, దక్షిణాఫ్రికా (5 మ్యాచులు.. 4 విజయాలు.. 1 ఓటమి.. 8 పాయింట్లు), భారత్ (6 మ్యాచులు.. 3 విజయాలు.. 3 ఓటములు.. 6 పాయింట్లు), వెస్టిండీస్ (6 మ్యాచులు.. 3 విజయాలు.. 3 ఓటములు.. 6 పాయింట్లు) ఉన్నాయి. టీమిండియా నెట్ రన్ రేట్ (+0.768) కంటే విండీస్ నెట్ రన్ రేట్ (-0.885) తక్కువగా ఉంది.