ICC Under-19 World Cup 2022:  వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో  యువ భారత్  ఫైనల్ కు దూసుకెళ్లింది. బుధవారం ఆసీస్  తో ముగిసిన సెమీస్ లో టీమిండియా అఖండ విజయాన్ని అందుకుంది. 

అండర్-19 ప్రపంచకప్ లో యువ భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో కంగారూలకు కంగారు పెట్టించి ఐదో సారి వరల్డ్ కప్ వేటకు సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్ లో భారీ స్కోరు సాధించి అనంతరం బౌలింగ్ లో ఆసీస్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అంటిగ్వా వేదికగా కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ సెమీస్ లో అద్భుతంగా రాణించిన యువ భారత జట్టు.. ఈ విజయంతో శనివారం ఇంగ్లాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచులో అమీతుమీ తేల్చుకోనుంది. అండర్-19 భారత జట్టు సారథి యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ లు అదరగొట్టే ప్రదర్శనతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించారు. భారత్ ఇప్పటికే నాలుగు సార్లు అండర్ -19 ప్రపంచకప్ గెలవగా.. ఇంగ్లాండ్ కు ఇదే తొలి ఫైనల్. భారత్ కు ఇది 8వ ఫైనల్. 

టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచులలో అద్భుత ప్రదర్శనలు చేసిన ఓపెనర్లు రఘువంశీ (30 బంతుల్లో 6), హర్నూర్ సింగ్ (28 బంతుల్లో 16) ఆసీస్ పేసర్ల ధాటికి ఇబ్బంది పడ్డారు. దీంతో భారత్ స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. 16 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులలోపే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ కు చేరారు. 

ఆ క్రమంలో వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ (110 బంతుల్లో 110), వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (108 బంతుల్లో 94) లు టీమిండియాను ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి మొదట్లో నెమ్మదిగా ఆడారు. ధుల్ 64 బంతుల్లో, రషీద్ 78 బంతుల్లో అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. బంతి నెమ్మదిగా పాతదయ్యాక ఇక ఈ ఇద్దరూ ఆగలేదు. పోటీ పడుతూ మరీ పరుగులు సాధించారు. భారీ షాట్లతో శతకాలకు దగ్గరయ్యారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ పేసర్లు, స్పిన్నర్లు ఎంతగా ప్రయత్నించినా ఇద్దరూ పట్టుదలతో ఆడారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు ఏకంగా 204 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

Scroll to load tweet…

విట్నీ వేసిన 43 వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన ధుల్.. సెంచరీ చేశాడు. తద్వారా అండర్-19 ప్రపంచకప్ ఫైనల్, సెమీస్ లో సెంచరీ చేసిన కెప్టెన్ల జాబితా (గతంలో విరాట్ కోహ్లి 2008 వరల్డ్ కప్ ఫైనల్ లో, 2012 ఫైనల్ లో ఉన్ముక్త్ చంద్ శతకాలు బాదారు) లో నిలిచాడు. 

సెంచరీ చేసిన తర్వాత ధుల్ ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. స్కోరును పెంచే క్రమంలో.. 45 వ ఓవర్ వేసిన నిస్బెట్ ఓవర్లో రనౌట్ అయ్యాడు. ఇక శతకానికి దగ్గరగా వచ్చిన రషీద్.. అదే ఓవర్ ఆఖరు బంతికి జాక్ సిన్ఫీల్డ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దీంతో 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఈ ఇద్దరూ నిష్క్రమించిన తర్వాత వచ్చిన దినేశ్ బానా (4 బంతుల్లో 20 నాటౌట్.. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), నిశాంత్ సింధు (10 బంతుల్లో 12 నాటౌట్) ధాటిగా ఆడారు. చివరి ఓవర్లో భారత్ 27 పరుగులు రాబట్టింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. 

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ విల్లీ (1)ని భారత స్వింగ్ బౌలర్ రవి కుమార్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ క్యాంప్బెల్ (30), కోరే మిల్లర్ (38) లు రెండో వికెట్ కు 68 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ భాగస్వామ్యాన్ని రఘువంశీ విడదీశాడు. అతడు వేసిన 16.3 ఓవర్లో కోరే మిల్లర్.. ఎల్బీగా వెనుదిరిగాడు.

ఇక ఆ తర్వాత ఆసీస్ క్రమంగా వికెట్లను కోల్పోయింది. లచ్లన్ షా (51) కాసేపు ప్రతిఘటించినా భారత్ విజయాన్ని అడ్డుకోలేదు. దీంతో 41.5 ఓవర్లలోనే ఆసీస్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో విక్కీ ఓస్త్వాల్ కు మూడు వికెట్లు దక్కగా.. నిశాంత్ సింధు, రవి కుమార్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో సెంచరీతో కదం తొక్కిన భారత సారథి యశ్ ధుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.