Asianet News TeluguAsianet News Telugu

అండర్19 వుమెన్స్ వరల్డ్ కప్: టీమిండియాకి శుభారంభం... సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఘన విజయం...

సౌతాఫ్రికా వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత మహిళా జట్టు... షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో... అజేయంగా 92 పరుగులు చేసిన శ్వేతా షెరావత్.. 

ICC U19 Womens T20 World cup 2023: Team India beats South Africa Women in 1st Match
Author
First Published Jan 15, 2023, 9:37 AM IST

మొట్టమొదటి ఐసీసీ వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి శుభారంభం లభించింది. సౌతాఫ్రికా వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది...

ఎలంద్రీ రెన్స్‌బర్గ్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేయగా కెప్టెన్ ఓలుహే సియో డకౌట్ అయ్యింది. కేల రెనెక్ 11 పరుగులు, మడిసన్ లాన్స్‌మన్ 17 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేయగా సిమోన్ లారెన్స్ 44 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. 

వికెట్ కీపర్ కరబో మెసో 11 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు, మియనో స్మిత్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో కెప్టెన్ షెఫాలీ వర్మ 2 వికెట్లు తీయగా సోనమ్ యాదవ్, పర్శవీ చోప్రా తలా ఓ వికెట్ తీశారు..

167 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి శుభారంభం దక్కింది. శ్వేతా షెరావత్‌తో కలిసి తొలి వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యం జోడించింది కెప్టెన్ షెఫాలీ వర్మ. 16 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన షెఫాలీ వర్మ అవుటైన తర్వాత తెలుగమ్మాయి గొంగడి త్రిషా 11 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుటైంది. 

సౌమ్య తివారి 10 పరుగులు చేయగా ఓపెనర్ శ్వేతా షెరావత్ 57 బంతుల్లో 20 ఫోర్లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసిన భారత మహిళా జట్టు, 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలవగా స్కాట్లాండ్‌ని 6 వికెట్ల తేడాతో ఓడించింది యూఏఈ మహిళా జట్టు. యునైటెడ్ స్టేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది శ్రీలంక మహిళా జట్టు...

భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌ని జనవరి 16న యూఏఈ టీమ్‌తో ఆడనుంది. ఆ తర్వాత జనవరి 18న స్కాట్లాండ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా.. 

Follow Us:
Download App:
  • android
  • ios