ICC Test Rankings: శ్రీలంకతో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో అన్ని విభాగాల్లో విశ్వరూపం చూపిన టీమిండియా రాక్ స్టార్ జడ్డూ.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో రఫ్ఫాడించాడు.
టీమిండియా ఆల్ రౌండర్ రాక్ స్టార్ రవీంద్ర జడేజా తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో రఫ్ఫాడించాడు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా లంకేయులకు చుక్కలు చూపించిన జడేజా.. ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని.. 406 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ (382 పాయింట్లు) ఒకస్థానం దిగజారి రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
శ్రీలంకతో టెస్టుకు ముందు మూడో స్థానంలో ఉన్న జడ్డూ.. ఆ టెస్టులో బ్యాటింగ్ లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా తొమ్మిది వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో అతడిని అగ్రస్థానం వరించింది. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు.
కొత్త కెప్టెన్ కిందికి.. పాత కెప్టెన్ పైకి...
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విఫలమైన నయా సారథి రోహిత్ శర్మ టెస్టు ర్యాంకింగ్స్ లో ఒక స్థానం దిగజారాడు. అంతకుముందు ఐదో స్థానంలో ఉన్న రోహిత్ (761 పాయింట్లు).. ఇప్పుడు ఒక ప్లేస్ పడిపోయి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక విరాట్ కోహ్లి (763 పాయింట్లు).. 2 స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి ఎగబాకాడు.
శ్రీలంకతో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. 723 పాయింట్లతో పదో స్థానానికి చేరాడు. దీంతో టాప్-10లో భారత ఆటగాళ్లు ముగ్గురు నిలిచారు. ఈ జాబితాలో 936 పాయింట్లతో ఆసీస్ ఆటగాడు మార్నస్ లబూషేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ (872) తర్వాత స్థానంలో నిలిచాడు.
ఇక బౌలర్ల జాబితాలో ఆసీస్ సారథి పాట్ కమిన్స్ 892 పాయింట్లతో తొలి స్థానంలో నిలువగా 850 పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (766 పాయింట్లు) పదో స్థానంలో నిలిచాడు.
