Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో విండీస్ దే విజయం.. ఇక బంగ్లా పులులు ఇంటికే...

West Indies Vs Bangladesh: ప్రపంచకప్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో వెస్టిండీస్ అదరగొట్టింది.  ఉత్కంఠభరితంగా సాగిన లో స్కోరింగ్ గేమ్ లో మాజీ ఛాంపియన్లనే విజయం వరించింది.  వరుసగా మూడో పరాజయంతో బంగ్లాదేశ్ టోర్నీ లో సెమీస్ అవకాశాలను కోల్పోయింది. 

ICC T20 Worldcup2021: west Indies beat bangladesh by 3 runs
Author
Hyderabad, First Published Oct 29, 2021, 7:31 PM IST

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన  మ్యాచ్  లో వెస్టిండీస్ అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. శుక్రవారం షార్జా వేదికగా జరిగిన గ్రూప్-1 కీలకపోరులో వెస్టిండీస్-బంగ్లాదేశ్ (WetIndies vs Bangladesh) ల మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ విజయం సాధించింది. బ్యాటింగ్ లో విఫలమైనా.. బౌలింగ్ లో అదరగొట్టి  టోర్నీలో తొలి గెలుపు సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. (bangladesh) విండీస్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది.నికోలస్ పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా, ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ రెగ్యులర్ కెప్టెన్ పొలార్డ్ రిటైర్డ్ హార్ట్  కావడంతో.. తాత్కాలిక కెప్టెన్ గా పూరన్ బాధ్యతలు నిర్వర్తించాడు. 


వెస్టిండీస్ (West Indies) నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్  ప్రారంభించిన బంగ్లాదేశ్ కు చెప్పుకోదగ్గ ఆరంభం దక్కలేదు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో తొలిసారి ఓపెనింగ్  బ్యాటర్  గా వచ్చిన బంగ్లా ఆల్ రౌండర్ షకిబ్ ఉల్ హసన్ (shakib ul Hasan) (9) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు.  రసెల్ వేసిన నాలుగో ఓవర్లో మూడో బంతికి మిడ్ ఆఫ్ లో ఉన్న హోల్డర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఇక మరో ఓపెనర్.. మహ్మద్ నయీం (19 బంతుల్లో 17).. రెండు ఫోర్లు కొట్టి  కుదురుకున్నట్టే కనిపించినా.. 6వ ఓవర్లో హోల్డర్ వేసిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఓవర్లో అతడికి జీవనదానం లభించినా దానిని సద్వినియోగం చేసుకోవడంలో నయీం విఫలమయ్యాడు. 

 

ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన లిటన్ దాస్ (43 బంతుల్లో 44)  నెమ్మదిగా ఆడుతూ బంగ్లాను లక్ష్యం దిశగా నడిపించాడు. ఇన్నింగ్స్  ఆఖరుదాకా ఆడిన దాస్.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. నిలకడ ప్రదర్శించాడు. అతడితో కలిసి  సౌమ్య సర్కార్ (17) కాసేపు నిలిచాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 30 పరుగులు జోడించారు. కానీ స్పిన్నర్ హోసిన్ వేసిన బంతికి సర్కార్.. గేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 65-3. మరో  పది ఓవర్లలో 78 పరుగులు చేయాలి. 

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీం (8)  కూడా రాంపాల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు విండీస్ బౌలర్లు  కట్టుదిట్టంగా బంతులు వేయడంతో  బంగ్లా సాధించాల్సిన రిక్వైడ్ రన్ రేట్ పెరిగిపోయింది. దీంతో  మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 16 ఓవర్లు  ముగిసేసరికి బంగ్లా స్కోరు 4 వికెట్లకు 110 పరుగులు.

 

17వ ఓవర్ నుంచి ఆట మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఆ ఓవర్ వేసిన అనుభవజ్ఞుడైన బ్రావో.. స్లో బంతులతో లిటన్ దాస్, అప్పుడే బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మహ్మదుల్లా (24 బంతుల్లో 31) కు విసుగు తెప్పించాడు.  ఆ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి.  సమీకరణం 18 బంతుల్లో 30 పరుగులుగా మారింది.  ఆ తర్వాత రాంపాల్ వంతు.. తొలి బంతికి ఫోర్ ఇచ్చిన రాంపాల్.. తర్వాత ఐదు బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్ లో.. మహ్మదుల్లా తొలి బంతికి లాంగాన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఆ ఓవర్లో 9 పరుగులు రాగా.. చివరి బంతికి లిటన్ దాస్ ఔటయ్యాడు. దీంతో సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. 

 

ఇక చివరి ఓవర్ వేసిన రసెల్.. తొలి  మూడు బంతులకు ఐదు పరుగులిచ్చాడు. నాలుగో బంతికి  మహ్మదుల్లా  ఇచ్చిన క్యాచ్ ను సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ ఫ్లెచర్ జారవిడిచాడు.  ఆ తర్వాత బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆఖరు బంతికి నాలుగు పరుగులు చేస్తే బంగ్లాది విజయం. కానీ యార్కర్ వేసిన రసెల్.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంతే.. విండీస్ ఆటగాళ్ల ముఖాల్లో విజయానందం. మూడు పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్.. ఈ టోర్నీలో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.  

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆ జట్టులో పూరన్ (40),  చేజ్ (39) మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు 

తక్కువ స్కోరును కాపాడుకునే క్రమంలో విండీస్ బౌలర్లు.. బంగ్లా బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. ఆ జట్టులో రవి రాంపాల్, జేసన్ హోల్డర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. రాంపాల్, హోల్డర్, రసెల్, హోసిన్ తలో  వికెట్ పడగొట్టారు. ఈ ఫలితంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. 

Follow Us:
Download App:
  • android
  • ios