T20 Worldcup: భారత్- పాక్ మ్యాచ్ పై భారత మాజీ బ్యాట్స్మెన్ మహ్మద్ కైఫ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఆటను ఆటలాగే చూడాలని.. యుద్ధంలా చూడొద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు.

టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup 2021) లో ఎన్ని మ్యాచులున్నా.. ఎవరితో ఎవరు ఆడినా భారత్ -పాక్ (India vs pakistan) మ్యాచ్ కు ఉండే క్రేజ్ మాత్రం అంతకుమించి..! రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో 2012 నుంచి భారత్-పాకిస్థాన్ లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరును కేవలం ఐసీసీ (ICC) టోర్నీల్లోనే చూస్తున్నాం. దీంతో రెండేళ్లకో.. నాలుగేళ్లకో జరుగుతున్న మ్యాచ్ లు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. 

ఇక రెండేళ్ల తర్వాత భారత్ తో పాకిస్థాన్ తలపడుతుండటంతో నేటి మ్యాచ్ కు రెండు దేశాలలో విపరీతమైన హైప్ వచ్చింది. ఈ పోరు కోసం ఇరు దేశాల అభిమానులు ఇప్పటికే టీవీలకు అతుక్కుపోయారు. కత్తులు, పిస్టోళ్లు, బాంబులు, యుద్ధ విమానాలు, రాకెట్ లాంఛర్లు లేకున్నా.. అంతకుమించిన విధ్వంసం బాల్ బ్యాట్ మధ్య జరుగనుండటంతో ఇరు దేశాల అభిమానులు దీనిని ఓ మినీ యుద్ధం మాదిరే చూస్తున్నారు. ఇక సోషల్ మీడియా రాకతో ఈ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. 

ఈ నేపథ్యంలో.. నేటి మ్యాచ్ పై భారత మాజీ బ్యాట్స్మెన్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) స్పందించాడు. ఆటను ఆటలాగే చూడాలని.. యుద్ధంలా చూడొద్దని అభిమానులకు సూచించాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కైఫ్.. ‘మీ అందరికీ ఒక చిన్న సూచన.. క్రికెట్ ను రాజకీయాలు, ద్వేషం, కోపంతో కాకుండా ఒక ఆటగా చూడటం మంచిది. ఆటను ఆస్వాదించండి. గెలిస్తే సంబురాలు చేసుకోండి. కానీ ఓడిపోయిన జట్టు పరాజయాన్ని కాదు. ఆటను ఆటగా చూడండి. యుద్ధంలా కాదు..’ అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

కాగా, ఇరు దేశాల మధ్య 2019 లో వన్డే ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మ్యాచే చివరిది. ఇక టీ20 ల విషయానికొస్తే 2016 లో జరిగిన మ్యాచ్ ఆఖరుది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్.. మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి.. 55 పరుగులతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.