Asianet News TeluguAsianet News Telugu

వాళ్లేమైనా వాగనివ్వు.. నువ్వు ఆట మీద దృష్టి పెట్టు.. షమీకి గవాస్కర్ మద్దతు.. కోహ్లి వ్యాఖ్యలపైనా కామెంట్స్

T20 Worldcup2021: పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్  లో భారత్ ఓడిపోయిన తర్వాత పలువురు నెటిజ్లను హద్దు మీరి ప్రవర్తించారు.  షమీ మతాన్ని కారణంగా చూపి.. అతడిని టార్గెట్ చేశారు. షమీ వల్లే టీమిండియా ఓడిపోయిందని, దానికి అతడు (షమీ) సంతోషించి ఉంటాడని కామెంట్స్ చేశారు. 

ICC T20 Worldcup2021: sunil gavaskar backs mohammad shami, lauds virat kohli  and team for support indian bowler
Author
Hyderabad, First Published Oct 31, 2021, 4:05 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో భాగంగా గత ఆదివారం భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్ అనంతరం టీమిండియా (Team india) పేసర్ మహ్మద్ షమీ (Mohammad shami) పై ట్రోల్ చేసిన వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (sunil gavaskar) అన్నాడు. ఆయన షమీకి మద్దతుగా నిలిచాడు. అంతేగాక షమీకి సపోర్ట్ గా ఉన్న టీమిండియా ఆటగాళ్లను అభినందించాడు. 

పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్  లో భారత్ ఓడిపోయిన తర్వాత పలువురు నెటిజ్లను హద్దు మీరి ప్రవర్తించారు.  షమీ మతాన్ని కారణంగా చూపి.. అతడిని టార్గెట్ చేశారు. షమీ వల్లే టీమిండియా ఓడిపోయిందని, దానికి అతడు (షమీ) సంతోషించి ఉంటాడని కామెంట్స్ చేశారు. దీంతో సీనియర్ క్రికెటర్లతో పాటు ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది దీనిని ఖండించారు. షమీ అంకితభావాన్ని  ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

ఇక ఇదే విషయమై సన్నీ ఓ జాతీయటీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘షమీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారి గురించి.. ఆ మాటల గురించి పట్టించుకోవాల్సిన పన్లేదు. ఈ పనికిమాలిన ట్రోల్స్ అసలు మ్యాటరే కాదు. మేము వాటిని లెక్కచేయం.  అసలు వాటికి గుర్తింపే లేదు’అని గవాస్కర్ అన్నాడు.


అంతేగాక షమీకి మద్దతుగా విరాట్ అండ్ కో నిలవడాన్ని గవాస్కర్ మంచి పరిణామంగా అభివర్ణించాడు.  ఈ సమయంలో అది (షమీకి) ఎంతో అవసరమని తెలిపాడు. ‘విరాట్ కోహ్లి (Virat kohli), అతడి బృందం షమీకి మద్దతుగా నిలవడం మంచి పరిణామం.  ఇలాంటివి ఎదురైనప్పుడు ఒకరి వెంట ఒకరు నిలవడం ఎంతో అవసరం’ అని అన్నాడు.

కాగా.. షమీపై వ్యాఖ్యలు చేస్తున్న వారి పట్ల కోహ్లి నిన్న కఠినంగానే స్పందించిన విషయం తెలిసిందే.  విరాట్ స్పందిస్తూ.. ‘‘భారత జట్టులోని ప్రతీ ఒక్కరూ టీమ్ గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతారు. జాతీయ పతకాన్ని రెపరెపలాడించాలనే ఓ గొప్ప ఉద్దేశంతో క్రికెట్ ఆడతాం. అంతేకానీ ఈ వెన్నెముక లేని వెధవలను ఎంటర్‌టైన్ చేయడానికి కాదు. మనిషికి ఎదురుపడి మాట్లాడే ధైర్యంలేని వాళ్లే, ఇలా సోషల్ మీడియాలో చెత్త వాగుడంతా పోస్టు చేస్తూ ఉంటారు. ఐడెంటెటీ చూపించుకోవడానికి కూడా ధైర్యం లేని వీళ్లు, ఇలా మనుషులను ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. 

సోషల్ మీడియా ఇలా ఎదుటివాళ్లని ఎగతాళి చేయడానికి, వారి ఎమోషన్స్‌తో ఆడుకోవడానికి వేదిక అవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఓ ప్లేయర్ మతాన్ని అడ్డుపెట్టుకుని, అతనిపై దాడి చేయడం ఎంతటి అమానవీయం. మేం ఓ జట్టుగా, ప్రతీ ప్లేయర్‌ను అర్థం చేసుకుంటాం. మా క్యారెక్టరే మాకున్న బలం. మనకంటూ ఓ క్యారెక్టర్ ఉండడం వల్లే మేమిప్పుడు ఇక్కడ ఉండగలిగాం. ఇలా ట్రోల్ చేసే వారికి దాని విలువ కూడా తెలీదు’ అని ఫైర్ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios