Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: ఒక గండం గడిచింది.. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.. భారత్ పై విజయానంతరం పాక్ కెప్టెన్

India vs Pakistan: భారత్ పై గెలవంగానే అంతా అయిపోయినట్లు కాదని, ఈ మెగా ఈవెంట్ లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని బాబర్ ఆజమ్ చెప్పుకొచ్చాడు. అతి విశ్వాసం పనికిరాదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని పాక్ ఆటగాళ్లకు సూచించాడు. 

ICC T20 Worldcup2021: Jinx over but long way to go, pakistan skipper babar azam tells his teammates after win against india
Author
Hyderabad, First Published Oct 25, 2021, 11:31 AM IST

గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ (ICC) టోర్నీలలో భారత్ (India) ను ఓడించాలనే పాకిస్థాన్ (Pakistan) అభిమానుల సుదీర్ఘ కలలను నెరవేర్చిన ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ (Babar Azam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ పై గెలవంగానే అంతా అయిపోయినట్లు కాదని, ఈ మెగా ఈవెంట్ లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. అతి విశ్వాసం పనికిరాదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని  తన సహచరులకు సూచించాడు. 

ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ (India vs pakistan)మ్యాచ్ అనంతరం బాబర్ స్పందించాడు. మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో బాబర్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్  కోసం మేం బాగా ప్రిపేర్ అయి వచ్చాం. గత చరిత్రను మా మైండ్ నుంచి తీసేశాం. ఈ మ్యాచ్ కు ముందు  మేం రచించిన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలుచేశాం. అందుకే ఫలితం  సాధించాం’ అని బాబర్ చెప్పాడు. 

అంతేగాక.. ఛేదన సమయంలో ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించడంపై స్పందిస్తూ.. ‘మేం మంచి భాగస్వామ్యం నిర్మించాలని అనుకున్నాం. ఆడుతున్నకొద్దీ పిచ్ కూడా మాకు సహకరించింది. దీంతో మేమిద్దరం చివరిదాకా ఉండి గెలిపించాలని  భావించాం’ అని అన్నాడు.  ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా వచ్చిన బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లు ఆఖరుదాకా నిలిచి ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 

 

భారత్ తో  మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మంగళవారం నాడు న్యూజిలాండ్ (Newzealand) తో తలపడనున్నది. ఈ మ్యాచ్ నేపథ్యంలో కూడా బాబర్ తన సహచరులను హెచ్చరించాడు. ‘ఒక గండం గడిచిపోయింది.మేం భారత్ ను ఓడించాం. దీంతోనే అంతా అయిపోయిందని కాదు. మనమింకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. భారత్ పై విజయంతో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతాం. కానీ అతివిశ్వాసం పనికిరాదు’ అని అన్నాడు. 

ఇక నిన్నటి మ్యాచ్ లో భారత్ పతనాన్ని శాసించిన పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిది (Shaheen shah afridi) మాట్లాడుతూ.. ‘ఈ విజయం మాకు చిరస్మరణీయమైంది’ అని అన్నాడు. ‘పవర్ ప్లేలో నేను వరుసగా మూడు ఓవర్లు వేయడం ఇదే తొలిసారి. తొలి రెండు ఓవర్లలో బంతి నుంచి కొంచెం స్వింగ్ రాబట్టాను. నా ప్రయత్నం వృథా కాలేదు. ఈ విజయం పాక్ అభిమానులకు అంకితం. మా అమ్మ, నాన్న, సోదరులు నామీద నమ్మకం ఉంచి నాకోసం చాలా ప్రార్థనలు చేశారు. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపాడు.

 

కొత్త బంతితో యార్కర్లు వేయడం తన బలమని చెప్పిన అఫ్రిది.. రోహిత్ శర్మ పై కూడా అదే విధంగా ట్రై చేశానని చెప్పాడు.   

Follow Us:
Download App:
  • android
  • ios