Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్ల విలవిల.. ఓడితే అంతే సంగతులు..

England vs Bangladesh: ఇంగ్లండ్ తో జరిగిన గ్రూప్-1 ఎనిమిదో మ్యాచ్ లో ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి బంగ్లా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. 

ICC T20 Worldcup2021: Engalnd restrict bangladesh to 124 in group 1 game
Author
Hyderabad, First Published Oct 27, 2021, 5:24 PM IST | Last Updated Oct 27, 2021, 5:24 PM IST

తొలి మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడిన బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటర్లు రెండో మ్యాచ్ లో తేలిపోయారు. బుధవారం ఇంగ్లండ్ (England) తో జరిగిన గ్రూప్-1 ఎనిమిదో మ్యాచ్ లో ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి బంగ్లా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు బంగ్లాను కట్టడి చేశారు. ఇరు జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ ఆడగా.. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఇక  ఇంగ్లండ్.. వెస్టిండీస్ ను చిత్తు చేసి విజయం సాధించింది. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన బంగ్లా.. అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకుంది.  ఆ జట్టుకు శుభారంభం అందించడంలో ఓపెనర్లు విఫలమయ్యారు. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరుమీద కనిపించిన లిటన్ దాస్ (9), ఫామ్ లో ఉన్న మహ్మద్ నయీం (5) లు వెంటవెంటనే ఔటయ్యారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇంగ్లండ్ స్పిన్నర్ మోయిన్ అలీ (Moin ali).. వరుస బంతుల్లో లిటన్ దాస్, నయీం లను ఔట్ చేసి ఇంగ్లిష్ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు.

 

ఓపెనర్ల నిష్క్రమణతో వచ్చిన ఆల్ రౌండర్ షకిబ్ ఉల్ హసన్ (4) కూడా ఎక్కువసేపు నిలువలేదు. క్రిస్ వోక్స్ వేసిన ఆరో ఓవర్లో.. ఫైన్ లెగ్ లో ఉన్న అదిల్ రషీద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 26 పరుగులకే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మమ్మదుల్లా (19), ముష్ఫీకర్ రహీం (30 బంతుల్లో 29) జట్టును ఆదుకునే యత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 37 పరుగులు జోడించారు.  నెమ్మదిగా కుదురుకుంటున్న ఈ జోడీని లివింగ్ స్టోన్ విడదీశాడు. 11వ ఓవర్ వేసిన అతడు.. ముష్ఫీకర్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 

ఇక ఆ తర్వాత వికెట్ల పతనం క్రమం తప్పకుండా సాగింది. అఫిఫ్ హుస్సేన్ (5).. మిల్స్ వేసిన సూపర్ త్రోకు రనౌట్ కాగా.. 14వ ఓవర్లో మహ్మదుల్లాను లివింగ్ స్టోన్ ఔట్ చేశాడు. ఆఖరు ఓవర్లలో వికెట్ కీపర్ నురుల్ హసన్ (16), నసుమ్ అహ్మద్ (19) ధాటిగా ఆడటంతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నిర్ణీత ఓవర్లుముగిసేసరికి ఆ జట్టు.. ఇంగ్లండ్ ముందు 125 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ఇక ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లాకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా  స్పిన్నర్ మోయిన్ అలీ,  క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ పొదుపుగా బౌలింగ్ చేశారు. 3 ఓవర్లు వేసిన అలీ.. 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఇక వోక్స్.. 4 ఓవర్లు వేసి 12 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.3 ఓవర్లు వేసిన లివింగ్ స్టోన్.. 15 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిల్స్ కు మూడు వికెట్లు దక్కాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios