Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: టీ20 మెగా ఫైనల్ కు మోదీని కాదని దీదీని పిలుస్తున్న దాదా.. బీసీసీఐ అధ్యక్షుడి కీలక నిర్ణయం

Sourav Ganguly-Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, గంగూలీకి సత్సంబంధాలున్నాయి.  ఒక డైనమిక్ లీడర్ గా గంగూలీ.. ఆమె పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నాడు. మమతకు కూడా క్రీడలంటే ఆసక్తి. 

ICC T20 Worldcup2021: BCCI president Sourav Ganguly invites west bengal CM mamata banerjee for T20 Worldcup Final
Author
Hyderabad, First Published Oct 28, 2021, 6:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఈనెల 17న అట్టహాసంగా ప్రారంభమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup).. సందడిగా కొనసాగుతున్నది. క్వాలిఫయింగ్  రౌండ్ ముగిసి.. ఇటీవలే సూపర్-12 (Super-12) రౌండ్ కూడా మొదలైంది. నవంబర్ 10 న తొలి సెమీస్.. 11 న రెండో సెమీస్ జరుగాల్సి ఉండగా.. 14న ఫైనల్ (T20 Finals) నిర్వహించనున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ (India) నుంచి ప్రత్యేక అతిథి దుబాయ్ వెళ్లనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ-BCCI) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ (Sourav Ganguly).. ఈ మెగా ఈవెంట్ కోసం తన స్వరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ (Mamata Banerjee)కి ఆహ్వానం పంపినట్టు వార్తలొస్తున్నాయి. 

బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీకి, గంగూలీకి సత్సంబంధాలున్నాయి.  ఒక డైనమిక్ లీడర్ గా గంగూలీ.. ఆమె పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నాడు. మమతకు కూడా క్రీడలంటే ఆసక్తి. ఇది పలుమార్లు ఈడెన్ గార్డెన్ లో ఆమె రాకతో నిరూపితమైంది  కూడా. 

కాగా, ప్రపంచకప్ ఫైనల్  చూడటానికి రావల్సిందిగా గంగూలీ.. సీఎంవో అధికారులకు ఇప్పటికే ఆహ్వానం పంపాడని సమాచారం. అయితే ప్రస్తుతం మమత.. గోవాలో ఉన్నారు. ఆమె గురువారం సాయంత్రంగానీ, లేదంటే శుక్రవారం గానీ  కోల్కతా వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లాక ఆమె గంగూలీ అభ్యర్థనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఐసీసీ టీ20 ఫైనల్ (ICC T20 Worldcup Final)తో పాటు మరో ఇన్విటేషన్ కూడా మమతకు అందింది. వచ్చే నెల 3 నుంచి 13 దాకా షార్జాలో షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (Sharjah International Book Fair) నిర్వహించనున్నారు. దీనికి కూడా రావాలని మమతకు ఆహ్వానం ఉంది. ఒకవేళ  ఈ కార్యక్రమానికి ఆమె హాజరైతే.. టీ20 మెగా ఫైనల్ లో మనం మమతను చూడొచ్చు. 13 తారీఖు బుక్ ఫెయిర్ కార్యక్రమం ముగిసిన  తర్వాత మరుసటి రోజే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. షార్జా నుంచి దుబాయ్ కు రోడ్డు మార్గంలో వెళ్లినా అరగంట ప్రయాణమే.. అయితే  ఈ రెండు కార్యక్రమాలపై దీదీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. 

 

మమతకు క్రీడలంటే ఆసక్తి. ఈ ఏడాది జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఫుట్బాల్ తో చేసిన ‘ఖేలా హోబే’ (Khela Hobe) ఎంత  హంగామా సృష్టించిందో తెలిసిందే. ఈ ఎన్నికల తర్వాత ఆమె దృష్టి జాతీయ రాజకీయాలపై పడింది. అంతేగాక..  బెంగాల్ ఎన్నికల (Bengal Elections) ఫలితం తర్వాత.. ప్రధాని మోదీ (PM Modi)ని ఢీకొట్టేది మమతే అని ప్రజలు చూస్తున్నారు. 

ఇక క్రీడల విషయానికొస్తే.. కోల్కతా లో జరిగే మ్యాచ్ లకు మమతా తప్పకుండా హాజరవుతారు. 2017 అండర-17 టీ20 ప్రపంచకప్, 2016 లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. 2019 లో ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ కు ఆమె హాజరయ్యారు. ఇక తాజాగా గంగూలీ అభ్యర్థన నిజమేనని  తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ-TMC) వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఆ పార్టీ ట్విట్టర్ ఖాతాలలో ట్వీట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలాఉండగా.. భారతదేశం ఆవల జరిగే భారీ టోర్నీకి ప్రధాని స్థాయి వ్యక్తిని కాకుండా  ఒక ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ఇదే ప్రథమం. సాధారణంగా భారత్ లో వివిధ రాష్ట్రాలలో జరిగే మ్యాచ్ లకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తారు తప్పితే అంతర్జాతీయ వేదికలపై వారికి ఆహ్వానం ఉండదు. మరి దుబాయ్ లో జరిగే మ్యాచ్ కు మమత హాజరవుతారా..? లేదా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios