David Warner: మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వార్నర్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అనుసరించాడు. యూరో ఛాంపియన్షిప్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రొనాల్డో.. తన ముందు ఉన్న కోక్ బాటిళ్లను పక్కనబెట్టిన విషయం తెలిసిందే.
గురువారం రాత్రి ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో భాగంగా శ్రీలంక (Srilanka)తో జరిగిన గ్రూప్-1 మ్యాచ్ లో ఆస్ట్రేలియా (australia) అదరగొట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బౌలింగ్ లో లంకేయులను కట్టడి చేసిన కంగారూలు.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ విజృంభించి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని సాధించారు. నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) మాజీ కెప్టెన్, అభిమానులంతా వార్నర్ భాయ్ అని పిలుచుకునే డేవిడ్ వార్నర్ (david Warner) 65 పరుగులతో తిరిగి ఫామ్ అందుకున్నాడు.
అయితే మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వార్నర్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Roanldo)ను అనుసరించాడు. యూరో ఛాంపియన్షిప్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రొనాల్డో.. తన ముందు ఉన్న కోక్ (Coco Cola) బాటిళ్లను పక్కనబెట్టి మంచినీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. తాజాగా వార్నర్ కూడా అలాగే చేశాడు.
శ్రీలంకతో మ్యాచ్ అనంతరం పాత్రికేయుల సమావేశానికి వచ్చిన వార్నర్.. అక్కడున్న కోక్ బాటిళ్లను తీసేస్తూ.. ‘వీటిని పక్కనబెట్టొచ్చా..?’ అని అన్నాడు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వచ్చి.. బాటిళ్లను టేబుల్ మీద పెట్టాల్సిందిగా సూచించాడు. ఇందుకు నవ్వుతూ సమాధానమిచ్చిన వార్నర్.. ‘ఓ.. అక్కడ పెట్టాలా..? ఓకే..’ అని అన్నాడు. ఆ తర్వాత.. ‘ఒకవేళ క్రిస్టియానోకు ఇది మంచిదైతే.. నాకూ మంచిదే..’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది.

ఇక రొనాల్డో.. కోక్ ను పక్కనబెడుతున్న వీడియో బయటకు వచ్చిన తర్వాత కోకో కోలా కంపెనీ అమ్మకాలు భారీ స్థాయిలో పడిపోయిన విషయం తెలిసిందే.ఆ సంస్థకు భారీ స్థాయిలో నష్టం కూడా వాటిల్లింది.
ఇక నిన్నటి పాత్రికేయుల సమావేశంలో వార్నర్ మాట్లాడుతూ.. తన ఫామ్ గురించి విమర్శకులు ఎప్పుడూ ఏదో విమర్శ చేస్తూనే ఉంటారని అన్నాడు. వాళ్లు నోళ్లు మూయించలేం కదా..? అని తెలిపాడు. ఇవన్నీ ఆటలో సహజమని.. బాగా ఆడితే ప్రశంసించేవాళ్లు, అలా జరుగకపోతే విమర్శలు ఎదుర్కోవడం కామన్ అయిపోయిందని వార్నర్ భాయ్ చెప్పాడు.
గురువారం జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనింగ్ బ్యాటర్ గా వచ్చిన వార్నర్.. 42 బంతుల్లోనే 65 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్-14 లో వార్నర్ దారుణ వైఫల్యం ఆయనతో పాటు వార్నర్ అభిమానులకు కూడా నిరాశ కలిగించింది. ఈ సీజన్ లో అతడు కెప్టెన్సీ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూ దూరమైన విషయం తెలిసిందే. తాజాగా అతడిని తీసుకోవడానికి కొత్త ఫ్రాంచైజీలతో పాటు ఇప్పటికే ఉన్న జట్లు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.
