Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: అఫ్ఘాన్ కు రెండో విజయం.. అస్గర్ కు ఘనమైన వీడ్కోలు.. నమీబియాకు తొలి ఓటమి..

Afghanistan Vs Namibia: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా ఎక్కడ కూడా విజయం కోసం ఆడుతున్నట్టు కనిపించలేదు.  పూర్తి ఓవర్ల పాటు ఆడిన ఆ జట్టు.. 9 వికెట్లు నష్టపోయి 98 పరుగులకే పరిమితమైంది.

ICC T20 Worldcup2021:  Afghanistan beat Namibia by 62 runs in former skipper asghar afghan's final match
Author
Hyderabad, First Published Oct 31, 2021, 7:08 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) గ్రూప్-2లో సెమీస్ బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్న అఫ్ఘానిస్థాన్ (afghanistan).. ఆ క్రమంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  ఆదివారం అబుదాబి వేదికగా నమీబియా (Namibia) తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు విజయం అన్ని రంగాల్లో రాణించి అద్భుత విజయాన్ని సాధించింది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియా కనీస పోరాటాన్ని కూడా ఇవ్వలేదు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి తమ మాజీ కెప్టెన్ అస్గర్ (asghar afghan) అఫ్ఘాన్ కు అఫ్ఘానిస్థాన్ (afghanistan) ఘనమైన వీడ్కోలు పలికింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా ఎక్కడ కూడా విజయం కోసం ఆడుతున్నట్టు కనిపించలేదు.  పూర్తి ఓవర్ల పాటు ఆడిన ఆ జట్టు.. 9 వికెట్లు నష్టపోయి 98 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా అఫ్ఘాన్.. 62 పరుగులతో విజయం సాధించింది. నమీబియా  టాపార్డర్ బ్యాటర్లతో పాటు మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. 

అఫ్ఘాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి నమీబియాకు సూపర్-12లో తొలి ఓటమిని పరిచయం చేశారు. నమీబియా ఇన్నింగ్స్ లో డేవిడ్ వీస్ (30 బంతుల్లో 26) ఒక్కడే టాప్ స్కోరర్. ఇక ఈ విజయం అఫ్ఘాన్ కు రెండోది కాగా..  నమీబియాకు తొలి ఓటమి.  ఈ మ్యాచ్ లో  బంతితో నమీబియా వెన్ను విరిచిన బౌలర్.. నవీన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అతడు ఈ అవార్డును అస్గర్ కు అంకితమిచ్చాడు.  

 

161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి  ఓవర్లోనే నవీన్ ఉల్ హక్..  క్రెయిగ్ విలియమ్సన్ (1) ఔట్ చేశాడు.  అదే ఊపులో నవీన్..  తన రెండో ఓవర్లో మైకెల్ వాన్ లింగెన్ (11) కూడా పెవిలియన్ కు పంపాడు. వన్ డౌన్ లో వచ్చిన జాన్ నికోల్.. (16 బంతుల్లో 14) నిలకడగా కనిపించినా అతడూ ఎక్కువ సేపు నిలువలేదు. ఆరో ఓవర్లో.. గుల్బాదిన్.. అతడిని బౌల్డ్ చేశాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి నమీబియా 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన  నమీబియా కెప్టెన్ గెర్హర్డ్ ఎరాస్మస్ (12) సిక్స్ కొట్టి ఊపుమీద కనపించినా.. అతడూ హమీద్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక ఎనిమిదో ఓవర్లో రషీద్ ఖాన్.. జేన్ గ్రీన్ ను బౌల్డ్ చేశాడు. పది ఓవర్లు ముగిసేసరికి నమీబియా స్కోరు 4 వికెట్లకు 55 పరుగులు. 

 

అప్పట్నుంచి నమీబియా పతనం వేగంగా సాగింది. 11 ఓవర్లో జెజె స్మిట్ (0) ను హమీద్  ఔట్ చేయగా.. 14వ ఓవర్లో  ఫ్రైలింక్ ను నవీన్ పెవిలియన్ కు పంపించాడు. 16వ ఓవర్లో పిక్కీ (3).. గుల్బాదిన్ కు చిక్కాడు. ఒకవైపు  వికెట్లు క్రమం తప్పకున్నా పడుతున్నా వీస్ మాత్రం సంయమనంతో ఆడాడు. కానీ 17వ ఓవర్లో హమీద్.. అతడిని బౌల్డ్ చేశాడు. ఆఖర్లో నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపుల్మెన్ (9 బంతుల్లో 12.. 2 ఫోర్లు) మెరుపులు మెరిపించినా అప్పటికే ఆ జట్టు  పరాజయం ఖరారైపోయింది. 

 

ఇక అఫ్ఘాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్, గుల్బాదిన్ నయీబ్, రషీద్ ఖాన్ రాణించారు. నవీన్.. 4 ఓవర్లలో 26 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. హమీద్..  నాలుగు ఓవర్లు వేసి 9 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక గుల్బాదిన్ అన్నే ఓవర్లు వేసి ఒక మెయిడిన్ ఓవర్ వేసి 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ కూడా పొదుపుగా (4-0-14-1) రాణించాడు.  కాగా, ఈ విజయంతో అప్ఘానిస్థాన్.. గ్రూప్-2 లో  నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో  ఆరు పాయింట్లతో పాకిస్థాన్ ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios