Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: భారత్ గండం దాటిన పాక్.. ఇక న్యూజిలాండ్ పని పట్టడమే తరువాయి.. కివీస్ పై పాకిస్థాన్ ప్రతీకార పోరు

Pakistan vs Newzealand: తమ తొలి మ్యాచ్ లో చిరకాల  ప్రత్యర్థి భారత్ ను చిత్తుగా ఓడించిన పాకిస్థాన్.. నేటి సాయంత్రం న్యూజిలాండ్ పని పట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. టీ 20 టోర్నీలో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇరు జట్ల మధ్య పోరు జరుగనున్నది.

ICC T20 Worldcup 2021: After historci win aginst india, pakistan want to take revange up against newzealand
Author
Hyderabad, First Published Oct 26, 2021, 4:10 PM IST

ఐసీసీ (ICC) టోర్నీలలో భారత్ (India) చేతిలో ఓటమి గండాన్ని దాటదనే మచ్చను తొలగించుకున్న పాకిస్థాన్ (Pakistan).. నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దం చేసుకుంటున్నది. గత నెలలో తమను ఆర్థికంగానే గాక మానసికంగా దెబ్బతీసిన న్యూజిలాండ్ (Newzealand) జట్టుపై పాక్ ప్రతీకారేచ్ఛ (Revenge)తో రగిలిపోతున్నది. ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఇప్పటికే ఆ జట్టు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నేటి పోరును పాక్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

తమ తొలి మ్యాచ్ లో చిరకాల  ప్రత్యర్థి భారత్ ను చిత్తుగా ఓడించిన పాకిస్థాన్.. నేటి సాయంత్రం న్యూజిలాండ్ పని పట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. టీ 20 టోర్నీలో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇరు జట్ల మధ్య పోరు (Pakistan vs newzealand) జరుగనున్నది. తొలిమ్యాచ్ లో భారత్ ను ఓడించడంతో పాక్ జట్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో నేటి పోరు రసవత్తరం కానున్నది. 

అక్కడ మొదలైంది.. 

సుమారు 18 ఏండ్ల తర్వాత గత నెలలో పాకిస్థాన్ తో సిరీస్ ఆడటానికి వచ్చిన న్యూజిలాండ్.. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా అర్థాంతరంగా సిరీస్ రద్దు చేసుకుని వెళ్లింది. భద్రతా కారణాలను చూపి ఆఖరు నిమిషంలో టూర్ ను రద్దు చేసుకున్నది. అసలే 2009 (పాకిస్థాన్ లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన)  తర్వాత   పాక్ లో సిరీస్ లు ఆడటానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదు. సుదీర్ఘ కాలం అనంతరం వచ్చిన కివీస్ కూడా హ్యాండ్ ఇచ్చి వెళ్లడంతో పాక్ క్రికెటర్లతో పాటు ప్రధాని కూడా షాకయ్యాడు. స్వయంగా ఇమ్రాన్ ఖాన్.. న్యూజిలాండ్ ప్రధానితో  మాట్లాడినా.. ఆటగాళ్ల భద్రతపై ఆయన హామీ ఇచ్చినా అవతలి వైపు నుంచి సమాధానం రాలేదు. ఇక ఇదే కారణం చూపి ఇంగ్లండ్ కూడా పాక్ కు ఝలక్ ఇచ్చింది. తాము కూడా సిరీస్ రద్దు చేసుకుంటున్నామని చెప్పింది. 

ఇలా సిద్ధమైంది..

ఈ రెండు పరిణామాలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాతో పాటు ఆ దేశ సీనియర్ క్రికెటర్లకు తీవ్ర కోపాన్ని తెప్పించాయి. దీంతో ఈ వివాదం జరుగుతున్నప్పుడే పలువురు పాక్ క్రికెటర్లు.. ‘రాబోయే ప్రపంచకప్ లో మన ప్రత్యర్థి  ఒక్క భారత్ మాత్రమే కాదు.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ ను కూడా ఓడించి వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలి’ అని బహిరంగంగానే కామెంట్స్ చేశారు.  ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లోనే భారత్ నుఓడించిన పాకిస్థాన్.. ఇప్పుడు న్యూజిలాండ్ పని పట్టడానికి సిద్ధమైంది. 

ఎవరి బలాలెంత..? 

పాకిస్థాన్ బలమెప్పుడూ బౌలింగే. మొన్న భారత్ తో మ్యాచ్ లో కూడా ఇదే తేటతెల్లమైంది. కొత్త బంతితో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ తో పాటు స్పిన్నర్లు ఇమాద్ వసీం, షాబాద్ ఖాన్  లు కివీల పని పట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక బ్యాటింగ్ లో ఆ జట్టు ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. గత మ్యాచ్ లో వారిద్దరూ అదరగొట్టారు. తర్వాత ఫఖార్ జమాన్, సీనియర్ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ కూడా టచ్ లోనే ఉన్నారు.  అదీ గాక మహ్మద్ హఫీజ్ కు న్యూజిలాండ్ కు మంచి రికార్డు ఉంది. కివీస్ పై అతడు టీ20లలో 552 పరుగులు చేశాడు. 

ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే..  ప్రాక్టీస్ మ్యాచ్ లలో తడబడ్డ ఆ జట్టు టీ20 టోర్నీలో తాము ఆడుతున్న తొలి మ్యాచ్ లో నెగ్గాలని పట్టుదలతో ఉంది. పాక్ పై రికార్డు బాగాలేకున్నా న్యూజిలాండ్ ఎప్పటికీ ఛాంపియన్ జట్టే. బౌలింగ్ లో ఆ జట్టు భారమంతా ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి ల మీదే ఉంది. ఐపీఎల్ లో రాణించిన లాకీ ఫెర్గూసన్ కూడా బాగా ఆడాలని కివీస్ కోరుకుంటున్నది. బ్యాటింగ్ లో ఆ జట్టుకు మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్  పెద్ద ఆస్తి. మిడిలార్డర్ లో జిమ్మీ నీషమ్, డెవాన్ కాన్వే కూడా ఫామ్ లోనే ఉన్నారు. 

పాక్ దే ఆధిపత్యం.. 

పాకిస్థాన్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్ లలో తలపడ్డాయి. ఇందులో 14 సార్లు పాక్ విజయం సాధించగా..  10 సార్లు కివీస్ నెగ్గింది. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లలో ఇరు జట్లు 5 సార్లు పోటీ పడ్డాయి. ఇందులో 3-2 తో పాకిస్థాన్ ముందంజలో ఉంది. 

ఇక  షార్జా పిచ్ స్లో గా ఉంటూ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. నెమ్మదిగా ఇది బ్యాటర్లకు సహకరిస్తుంది. దీంతో  టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా  బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది.

తుది జట్లు అంచనా: 

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్టిల్‌, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్), టిమ్‌ సీఫర్ట్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌,  డెవాన్‌ కాన్వే, మిచెల్‌ సాంట్నర్‌,  జిమ్మీ నీషమ్‌, డారిల్‌ మిచెల్‌, లాకీ ఫెర్గూసన్‌, ఇష్‌ సోధి, ట్రెంట్‌ బౌల్ట్

పాకిస్తాన్‌: బాబర్‌ ఆజం (కెప్టెన్), మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖార్‌ జమాన్‌, షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌, ఇమాద్‌ వసీం, అసిఫ్‌ అలీ, షాబాద్‌ ఖాన్‌, హసన్‌ అలీ, హారిస్‌ రౌఫ్‌, షాహిన్‌ ఆఫ్రిది

Follow Us:
Download App:
  • android
  • ios