ICC T20 World cup: మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూఏఈ వేదికగా జరుగబోయే ఈ బిగ్ టోర్నీని విజయవంతం చేయాలని ICC భావిస్తున్నది. ఇందులో భాగంగా నేడు కీలక నిర్ణయాలు వెల్లడించింది. 

క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో జరుగబోయే T20 World cup కోసం ఆటగాళ్లకు తమ భార్య, పిల్లలను వెంట తెచ్చుకునేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఐసీసీ హెడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ అలెక్స్ మార్షల్ ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. 

గురువారం Dubai లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘సుమారు నెల రోజుల పాటు నిర్వహించబోయే ఈ మెగా టోర్నీలో ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని కాపాడుకోవడం కూడా మా కర్తవ్యం. అందుకే మేము వారికి అన్ని విధాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా మానసిక సమస్యలతో తలెత్తితే వారికి ప్రొఫెషనల్స్ తో చికిత్స ఇప్పిస్తాం. ఇదీ గాక చాలా మంది ఆటగాళ్లు వారి కుటుంబాలను చూడాలని అనుకుంటారు. అందుకే క్రికెటర్ల భార్య, పిల్లలను వెంట తెచ్చుకోవడానికి అనుమతినిస్తున్నాం. అయితే వీళ్లు కూడా టోర్నీ ముగిసేంతవరకు బయో బబుల్ లోనే కొనసాగాల్సి ఉంటుంది’ అని తెలిపారు. 

ఇంకా alex marshall మాట్లాడుతూ.. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ఆయన క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు, అభిమానులకు పిలుపునిచ్చారు. అభిమానులెవరూ ప్లేయర్ల లాబీల్లోకి వెళ్లడానికి అనుమతుల్లేవని, అంతేగాక ఆటగాళ్లతో సెల్ఫీలు దిగడం నిషేధించినట్టు వివరించారు. 

ఒకవేళ ఎవరైనా ఆటగాడు కరోనా బారిన పడితే అతడు పది రోజుల పాటు కచ్చితంగా ఐసోలేషన్ లో ఉండాల్సిందేనని, వారితో పాటు కాంటాక్ట్ లో ఉన్నవాళ్లు కూడా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పొట్టి ప్రపంచకప్ మ్యాచ్ లను వీక్షించేందుకు 70 శాతం సీటింగ్ తో అనుమతినిచ్చిన నేపథ్యంలో.. మ్యాచ్ లు చూడటానికి వచ్చే అభిమానులు కూడా పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ వేసుకుని కరోనా మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. 

ఇదిలాఉండగా.. కుటుంబ సభ్యుల్ని వెంట తెచ్చుకోవచ్చన్న ఐసీసీ నిర్ణయం భారత క్రికెటర్లకు లాభం చేకూర్చేదే. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మతో పాటు చాహల్, పాండ్యా, రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్ల భార్యలు ప్రస్తుతం దుబాయ్ లోనే సందడి చేస్తున్న విషయం తెలిసిందే.