IND vs PAK: ఐపీఎల్-14 (IPL) సీజన్ ముగిసిన వెంటనే  యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలుకానున్నది. ఇందులో భాగంగా ఈనెల 24న భారత్-పాకిస్థాన్ ల మధ్య జరిగే సమరానికి ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 

దాయాదుల మధ్య పోరు ఎప్పటికీ ఆసక్తికరమే. అది భారత్ లో అయినా పాక్ లో అయినా.. వేదిక ఎక్కడైనా క్రేజ్ మాత్రం తగ్గదు. అసలు క్రికెట్ అంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఇండియా పాక్ మ్యాచ్ ఉందంటే ఆ రోజు ఆఫీసులకు సెలవు పెట్టి మరీ టీవీల ముందు కూర్చుంటారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్.. అక్టోబర్ 24న పాక్ తో తలపడబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 

తాజాగా మరో ఆసక్తికర విషయం నెట్టింట గుప్పుమన్నది. రెండు దేశాల మధ్య జరిగే పోటీని ప్రత్యక్ష ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ (Star Sports).. అడ్వర్టైజ్మెంట్స్ (Advertisements) రూపేణా భారీ మొత్తంలో ఆదాయం రాబట్టిందట. దాదాపు 14 స్పాన్సర్లు.. మ్యాచ్ మధ్యలో యాడ్స్ కోసం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తున్నది. 

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పది సెకండ్ల యాడ్ కు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా స్టార్ స్పోర్ట్స్ డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. ఇదే నిజమైతే ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన డీల్ అని టాక్. అయితే ఇందుకు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఎలాంటి కామెంట్ చేయలేదు.

టీ20 ప్రపంచకప్ కు స్టార్ స్పోర్ట్స్ లైవ్ బ్రాడ్కాస్టర్ కాగా.. దానితో ఒప్పందం కుదుర్చుకున్న 14 స్పాన్సర్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. 
డ్రీమ్ 11, బైజూస్, ఫోన్ పే, థమ్స్ అప్, విమల్, హవేల్స్, జియో మార్ట్, నెట్ మేడ్స్. కామ్ లు కో స్పాన్సర్లు. ఆకాశ్, స్కోడా, వైట్హాట్జర్, గ్రేట్ లర్నింగ్, కొయిన్ డిసిఎక్స్, ట్రెండ్స్ లు అసోసియేట్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. కో ప్రెసెంటింగ్ స్పాన్సర్లు ఇప్పటికే సుమారు రూ. 70 కోట్ల దాకా అమ్ముడుపోగా, అసోసియేట్ స్పాన్సర్షిప్ రైట్స్.. రూ. 35 కోట్లకు అమ్ముడయ్యాయి.