సౌతాఫ్రికాకు షాకిచ్చిన వరుణుడు.. జింబాబ్వేకు తప్పిన ఓటమి గండం
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ లో ఫలితం తేలలేదు. వర్షం వల్ల 9 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసేప్పుడు మళ్లీ వాన అంతరాయం కలిగించింది.
పొట్టి ప్రపంచకప్ వేటను ఘనంగా ఆరంభించాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. గ్రూప్-2లో భాగంగా జింబాబ్వేతో పోటీ పడిన సౌతాఫ్రికా.. 80 పరుగుల ఛేదనలో వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. అంతకుముందు 9 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వెస్లీ మాధేవేరె (18 బంతుల్లో 35 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్), మిల్టన్ శుబ్మా (20 బంతుల్లో 18, 2 ఫోర్లు) ధాటిగా ఆడారు. దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినప్పటికీ రెండు సార్లు వర్షం పడటంతో మ్యాచ్ ను అర్థాంతరంగా నిలిపేసి పాయింట్లను రెండు జట్లకు సమానంగా పంచారు.
హోబర్ట్ వేదికగా ముగిసిన మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు గంటల తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు నిర్వాహకులు. ఈ క్రమంలో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు వచ్చిన జింబాబ్వే కు సఫారీ బౌలర్లు వరుస షాకులిచ్చారు.
ఓపెనర్ గా వచ్చినవికెట్ కీపర్ చకబ్వ (8) ను లుంగి ఎంగిడి ఔట్ చేయగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (2) ను పార్నెల్ ఔట చేశాడు. సీన్ విలియమ్స్ (1) రనౌట్ అయ్యాడు. సికిందర్ రాజా (0) డకౌట్ అయి నిరాశపరిచాడు. కానీ మాధేవేరె మాత్రం సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. జింబాబ్వేకు ఫైటింగ్ టోటల్ ను అందించాడు.
లక్ష్య ఛేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (18 బంతుల్లో 47 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. చతారా వేసిన తొలి ఓవర్లో డికాక్.. 4, 4, 4, 4, 6, 4 బాదాడు. చివరి బంతికి సింగిల్ వచ్చింది. దీంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులొచ్చాయి. రెండో ఓవర్లో తొలి బంతి పడగానే ఆటను మళ్లీ వర్షం పలకరించింది. దీంతో టార్గెట్ ను ఏడు ఓవర్లలో 64 పరుగులుగా సెట్ చేశారు. తర్వాత క్రీజులోకి వచ్చిన డికాక్.. ఎంగర్వ వేసిన ఆ ఓవర్లో కూడా డికాక్.. 4, 4, 4, 0, 4 బాదాడు. ఆ ఓవర్లో కూడా 17 పరుగులొచ్చాయి. మూడో ఓవర్ సికిందర్ రాజా వేశాడు. కానీ ఆ ఓవర్లో చివరి బంతి పడగానే మళ్లీ వరుణుడు తన పనిని స్టార్ట్ చేశాడు. దీంతో చేసేదేమీ లేక ఆటగాళ్లు, అంపైర్లు డగౌట్ కు చేరారు.
మ్యాచ్ కటాఫ్ సమయానికి మరో 8 నిమిషాలే ఉండటం.. ఇంకా ఐదు ఓవర్ల ఆట కూడా సాగకపోవడంతో.. కొద్దిసేపు విరామం తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఫలితం తేలని ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు తలో పాయింట్ దక్కింది.