శివాలెత్తిన స్టోయినిస్.. లంకపై ఈజీ విక్టరీతో బోణీ కొట్టిన ఆసీస్
T20 World Cup 2022: తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ లో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకకు చుక్కలు చూపించి ప్రపంచకప్ లో బోణీ కొట్టింది.
స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. మంగళవారం శ్రీలంకను చిత్తుగా ఓడించి ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ (18 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరోన్ ఫించ్ కూడా రాణించడంతో ఆసీస్ ఈజీ విక్టరీ కొట్టింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంకకు పాట్ కమిన్స్ తన తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. లంక ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఐదో బంతికి కుశాల్ మెండిస్ (5) మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లంక ఓపెనర్ పతుమ్ నిస్సంక (45 బంతుల్లో 40, 2 ఫోర్లు) తో కలిసి ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26, 3 ఫోర్లు) స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు.
ఆస్టిన్ అగర్ వేసిన 11 ఓవర్ మూడో బంతికి లేని పరుగు కోసం యత్నించిన ధనంజయ డిసిల్వా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత లంక వరుసగా వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్ మూడో బంతికి పతుమ్ నిస్సంక రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన భానుక రాజపక్స (7) ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. 15 ఓవర్లకు లంక స్కోరు 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ శనక (3), హసరంగ (1) కూడా విఫలమయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోతున్నా చరిత్ అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు).. చమీక కరుణరత్నె (7 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు) లంక స్కోరును 150 రన్స్ దాటించాడు. నిర్ణీత 20 ఓవర్లలో లంక.. 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. మిచెల్ మార్ష్, స్టోయినిస్ కు తప్ప బౌలింగ్ వేసిన హెజిల్వుడ్, కమిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్‌వెల్ లకు తలా ఓ వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్ ను ఆసీస్ నెమ్మదిగా ప్రారంభించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11) వికెట్ ను త్వరగానే కోల్పోయిన ఆసీస్.. మిచెల్ మార్ష్ (17) వికెట్ సైతం త్వరగానే కోల్పోయింది. కానీ ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్, 1 సిక్సర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 23, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు మూడో వికెట్ కు 29 పరుగులు జోడించారు. చమీక కరుణరత్నే వేసిన 12.2 ఓవర్లో మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్ వద్ద అషీన్ బండారా సూపర్ క్యాచ్ తో నిష్క్రమించాడు.
ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన స్టోయినిస్ మెరుపులు మెరిపించాడు. లంక బౌలర్లను వరుసపెట్టి బాదుతూ ఆసీస్ స్కోరు వేగాన్ని రాకెట్ కంటే స్పీడ్ గా పెంచాడు. తాను ఎదుర్కున్న మూడో బంతికి ఫోర్ బాదిన అతడు.. శనక వేసిన 14వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఇక హసరంగ వేసిన 15వ ఓవర్ లో 6, 4, 6 తో వీరబాదుడు చూపాడు. తీక్షణ వేసిన 16వ ఓవర్లో 6, 6, 6 కొట్టాడు. చివరి సిక్సర్ తో స్టోయినిస్.. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కుమార వేసిన 17వ ఓవర్లో.. భారీ సిక్సర్ కొట్టిన స్టోయినిస్ మ్యాచ్ ను ముగించాడు. 13 ఓవర్లకు 97-3 గా ఉన్న ఆసీస్ స్కోరు.. 16.3 ఓవర్ కు వచ్చేసరికి 158-3 కు చేరి విజయాన్ని అందుకుంది. 13 ఓవర్లప్పుడు 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉండగా. అందులో 52 పరుగులు రాబట్టింది స్టోయినిసే కావడం గమనార్హం. స్టోయినిస్ బాదుడుకు లంక ప్రీమియర్ స్పిన్నర్ వనిందు హసరంగ.. 3 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విజయంతో మెగా టోర్నీలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది.