Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: ఐపీఎలే ముఖ్యమనుకునేవాళ్లకు ఏం చెబుతాం..? టీమిండియా, బీసీసీఐపై కపిల్ దేవ్, గావస్కర్ ఫైర్

Kapil Dev: ఆటగాళ్లు (టీమిండియా) దేశానికి కాకుండా ఐపీఎల్ కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాళ్లకు మనమేం చెబుతాం. దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావించాలంటూ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.

ICC T20 World cup 2021: When players prioritize IPL over playing for the Nation, what can we say, kapil dev slams Team india and BCCI
Author
Hyderabad, First Published Nov 8, 2021, 1:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 ప్రపంచకప్ లో  టీమిండియా పేలవ ప్రదర్శనకు తీరిక లేని షెడ్యూలే కారణమని విమర్శలు వినిపిస్తున్న తరుణంలో  భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించారు. అసలు టీమిండియా ఆటగాళ్లకు దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే కాసుల వేటలో వెలిగిపోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) మీదే ఆసక్తి ఉన్నప్పుడు వాళ్లకు ఏం చెబుతామంటూ తమ నిస్సహయతను వ్యక్తం చేశారు. దేశానికి ఆడాలనుకునేవాళ్లు ఇలాంటి టోర్నీలకు ఆడకపోవడం మంచిదని సూచించారు. 

పొట్టి ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచులను దారుణంగా ఓడిన టీమిండియా.. తర్వాత రెండు మ్యాచులలో చిన్న జట్లపై విజయాలు సాధించింది. అయితే  టీమిండియ సెమీస్ చేరాలంటే అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ లో అఫ్గాన్ ఏదైనా అద్భుతం చేయాలని అంతా ఆశించారు. కానీ అలా జరుగులేదు. ఫలితంగా టీమిండియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనిపై కోట్లాది క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు టీమిండియా ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదే విషయమై భారత్ కు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లు (టీమిండియా) దేశానికి కాకుండా ఐపీఎల్ కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాళ్లకు మనమేం చెబుతాం. దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావించాలి. ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం నాకు తెలియదు. కానీ.. వారి తొలి ప్రాధాన్యం ఫ్రాంచైజీల కంటే దేశానికే ఉండాలి. అలా అని నేను వాళ్లను అక్కడ (ఐపీఎల్) ఆడొద్దని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ బాధ్యత బీసీసీఐ మీద ఉంది. ఆటగాళ్లు మంచి ఆట ఆడటానికి అనుకూలంగా ఉండే విధంగా షెడ్యూళ్లను రూపొందించాలి. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండటానికి ఇదో (టీ20 ప్రపంచకప్ వైఫల్యం) మనకు మంచి అవకాశం..’ అని అన్నారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం. అందుకు తగ్గ ప్రణాళికలను సిద్దం చేయాలి. ప్రపంచకప్ లో ఓడినంత మాత్రానా అంతా అయిపోయినట్టు కాదు. ఐపీఎల్ కు,  ప్రపంచకప్ కు గ్యాప్ ఉండాలి’ అని సూచించాడు. 

ఇక సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లు పనిఒత్తిడి గురించి  మాట్లాడుతున్నారు. ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటే..  కొంతమంది భారత ఆటగాళ్లు ఐపీఎల్ చివరి మ్యాచ్ లకు దూరంగా ఉంటే సరిపోయేది కదా..? వాళ్లు అలా ఆడకుండా ఉండగలరా..? ఇండియా కోసం ఆడటానికి.. తమను తాము ఫ్రెష్ గా ఉంచుకోగలరా..?  దీనిపై వాళ్లు సమాధానం చెప్పాలి. మరీ ముఖ్యంగా మీరు క్వాలిఫై కాలేమని అవగతమైనప్పుడు వాళ్లు పది రోజులో.. పదిహేను రోజులో విరామం తీసుకుని ఉంటే బాగుండేది కదా.  ప్రపంచకప్ కు ముందు ఆ మాత్రం విరామం దొరికినా మంచిదే కదా..?’ అంటూ  ఫైర్ అయ్యారు.

టీ20 ప్రపంచకప్ లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన తర్వాత బయో బబుల్ జీవితాల గురించి మాట్లాడిన టీమిండియా.. ఐపీఎల్ కు ముందే ఈ ఇష్యూను ఎందుకు ప్రస్తావించలేదని సీనియర్ క్రికెటర్లు ప్రశ్నించారు. తీరికలేని షెడ్యూల్ లో కూడా టీవీ యాడ్స్ కోసం గంటలకు గంటలు ఎలా కేటాయిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రపంచకప్ లో భారత్ నిష్క్రమణ టీమిండియా తో పాటు బీసీసీఐ కి ఒక కనువిప్పు కలగాలని వారు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ తో పాటు 2023 లో జరగాల్సి ఉన్న వన్డే ప్రపంచకప్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చేయాలంటే అందుకు అనుగుణంగా బీసీసీఐ షెడ్యూల్ ను రూపొందించాలని కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios