Asianet News TeluguAsianet News Telugu

మేం బుర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాం మరి..! పీటర్సన్ ను దారుణంగా ట్రోల్ చేసిన వసీం జాఫర్.. వైరల్ అవుతున్న ట్వీట్

T20 World Cup 2021: తమకు వన్డే ప్రపంచకప్ ను దక్కకుండా చేసిన ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన  మ్యాచ్ లో  ఇంగ్లీష్ జట్టును ఓడించి.. టీ20 ప్రపంచకప్ లో తొలిసారి ఫైనల్స్ కు  ప్రవేశించింది. 

ICC T20 World Cup 2021: Wasim jaffer trolls kevin pietersen after new Zealand beat England
Author
Hyderabad, First Published Nov 11, 2021, 4:41 PM IST

రెండేండ్ల  క్రితం (2019లో) వన్డే ప్రపంచకప్ ను తమ నుంచి దూరం చేసిన ఇంగ్లాండ్ పై బుధవారం రాత్రి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.  నిన్న రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్ లో కివీస్..  ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.  టోర్నీ ఫేవరేట్లుగా ఉన్న ఇంగ్లీష్ జట్టును ఊహించని దెబ్బ కొడుతూ.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. కివీస్ ప్రదర్శన పట్ల ఆ దేశానికి చెందని పలువురు సీనియర్లతో పాటు ఇతర దేశాల మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలాఉండగా భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ను దారుణంగా ట్రోల్ చేశాడు. 

వారం రోజుల క్రితం పీటర్సన్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘ఈ టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మాత్రమే ఇంగ్లాండ్ ను ఓడించగలవు. అయితే అది షార్జా లో మాత్రమే. ఒకవేళ మిగతా ఎక్కడైనా అయితే ఇంగ్లాండ్ కు ట్రోఫీ అందివ్వడమే బెస్ట్..’ అంటూ ట్వీట్ చేశాడు.

 

ఇప్పుడు ఈ ట్వీట్ నే వసీం జాఫర్ తన ట్రోల్ కు ఉపయోగించుకున్నాడు. ఇదే ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. అందులో  న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఫోటో మీమ్ ను పోస్ట్ చేశాడు. మీమ్ లో.. ‘హా.. మేము ఇక్కడికి బుర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాం..’అని రాసి ఉంది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.

కాగా.. వసీం ట్వీట్ కు నెటిజ్లను భిన్నాభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేస్తూ.. ‘వసీం భాయ్ మైకెల్ వాన్ ను ట్రోల్ చేసి చేసి బోర్ కొట్టి పీటర్సన్ మీద దృష్టి సారించాడు’ అని రాయగా మరొకరు.. ‘యార్క్ షైర్ జాత్యాహంకార ఘటన తర్వాత మైకెల్ వాన్ ట్వీట్లు చేయడం మానేశాడ’ని ట్వీట్ చేశాడు. గతంలో వాన్, జాఫర్ మధ్య పలుమార్లు ట్విట్టర్ లో ట్వీట్ల యుద్ధం కొనసాగింది. మరికొందరు ఇంగ్లీష్ ఫ్యాన్స్.. ‘మాకన్నా (ఇంగ్లాండ్) మీరే (టీమిండియా) ముందు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు కదా.. మేము కనీసం సెమీస్ కైనా చేరాం..’ అంటూ రిప్లై ఇచ్చారు. 

 

బుధవారం జరిగిన తొలి సెమీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఛేదన ప్రారంభించిన న్యూజిలాండ్.. 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఆ జట్టు ఓపెనర్ డరిల్ మిచెల్.. (72 నాటౌట్), కాన్వే (46) లు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు. అయితే 16 ఓవర్ల దాకా మ్యాచ్ ఇంగ్లాండ్ వైపే ఉంది. 17వ ఓవర్లో నీషమ్ వీర విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు.. ఫోర్ తో 23 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా కివీస్ వైపునకు మళ్లింది. మొత్తంగా 11 బంతులాడిన నీషమ్.. మూడు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి కివీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios