Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: లంకేయులను జయించలేకపోతున్న యూనివర్సల్ బాస్.. శ్రీలంకపై కొనసాగుతున్న గేల్ చెత్త ప్రదర్శన

Chris Gayle: ఫార్మాట్ ఏదైనా,  ప్రత్యర్థి ఎవరైనా బాదుడే అతడి మంత్రం.. టీ20 ఫార్మాట్ లో అయితే గేల్ బాదుడుకు బాధితుడు కాని బౌలరే  లేడు. కానీ అంతటి విధ్వంసకరవీరుడు.. లంకేయులను మాత్రం జయించలేకపోతున్నాడు. 

ICC T20 World cup 2021: Universal boss Chris Gayle struggles to score runs against srilanka continues his bad record
Author
Hyderabad, First Published Nov 5, 2021, 11:45 AM IST

ఆధునిక క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ గా గుర్తింపు పొందిన అతి కొద్ది మంది క్రికెటర్లలో వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ (chris gayle) ఒకడు. క్రీజులో దిగాడంటే చాలు బంతి స్టేడియం ఆవల పడాల్సిందే. ఫార్మాట్ ఏదైనా,  ప్రత్యర్థి ఎవరైనా బాదుడే అతడి మంత్రం.. టీ20 ఫార్మాట్ లో అయితే గేల్ బాదుడుకు బాధితుడు కాని బౌలరే లేడంటే మాత్రం అతిశయోక్తి కాదు. కానీ అంతటి విధ్వంసకరవీరుడు.. లంకేయులను మాత్రం జయించలేకపోతున్నాడు. 

అవునూ.. యూనివర్సల్ బాస్ (Universal boss) గా పేరున్న క్రిస్ గేల్.. టీ20లలో శ్రీలంక (Srilanka) పై చెత్త రికార్డును కలిగిఉన్నాడు. నిన్నటి మ్యాచ్ లో ఆ రికార్డును కొనసాగించాడు. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలపై విరుచుకుపడే ఈ కరేబియన్ కింగ్.. లంక పై మాత్రం పేలని బాంబే. గత రికార్డులు చూస్తే ఈ పోలిక నిజమనిపించక మానదు. 

పొట్టి ఫార్మాట్ లో ఇప్పటివరకూ గేల్.. 446 మ్యాచ్ లు ఆడాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా సాధించలేని విధంగా 14,261 పరుగులు చేశాడు. వీటిలో 22 శతకాలు.. అత్యధిక స్కోరు 175. ఇక ఫిఫ్టీలకు లెక్కేలేదు.  ఇంతటి ఘనతలు ఉన్న గేల్.. లంకపై మాత్రం తేలిపోతున్నాడు. ఆ జట్టుపై అతడు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఒక్కసారి తప్పితే మిగతా సందర్భాల్లో దారుణంగా విఫలమయ్యాడు. 

లంకపై గేల్ ఆడిన గత తొమ్మిది టీ20లలో స్కోర్లు వరుసగా.. 63 నాటౌట్, 5, 2, 3, 3, 0, 16, 13, 1 పరుగులు.  యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్ (ICC T20 World cup) లో భాగంగా నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా  గేల్ దారుణంగా  విఫలమయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన గేల్.. 5 బంతులాడి 1 పరుగుకే ఔట్ అయ్యాడు. 

ప్రపంచ భీకర బౌలర్లను, అగ్రశ్రేణి స్పిన్నర్ల బౌలింగ్ ను తుత్తునీయలు చేసి.. వాళ్లందరికీ నిద్ర లేని రాత్రులను పరిచయం చేసిన గేల్ మాత్రం లంకేయులను జయించకపోవడం గమనార్హం. దేశం, ఫ్రాంచైజీతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ను సంపాదించిన గేల్ అభిమానులు కూడా దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఇదిలాఉండగా.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ (west indies) దారుణ పరాజయం పాలైంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఆ జట్టు సమిష్టిగా విఫలమైంది. రెండు టీ20  ప్రపంచకప్ లు నెగ్గి మూడో ది గెలవాలని భావించిన విండీస్.. లీగ్ దశ కూడా దాటకుండానే నిష్క్రమిస్తుండటం గమనార్హం. జట్టు నిండా ఆల్ రౌండర్లు, హిట్టర్లు ఉన్నా ఆ జట్టు ఈసారి అత్యంత పేలవంగా ఆడి విమర్శల పాలైంది. ఇక గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. తర్వాత స్థానం కోసం దక్షిణాఫ్రికా, ఆసీస్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios