Asianet News TeluguAsianet News Telugu

వారెవ్వా కివీస్.. కేన్ మామ సారథ్యంలో 3 ఫార్మాట్లలో అదరగొడుతున్న న్యూజిలాండ్.. తొలి టీ20 కప్పుకు ఒక్క అడుగే..

New zealand: టెస్టు.. వన్డే.. టీ20.. ఫార్మాట్ ఏదైనా కేన్ మామ నేతృత్వంలోని న్యూజిలాండ్ అదరగొడుతున్నది. ఈ ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నెగ్గిన ఆ జట్టు.. తొలి టీ20 ప్రపంచకప్పును అందుకోవడానికి అడుగుదూరంలో నిలిచింది. 

ICC T20 World Cup 2021: These are The 5 reasons behind why New Zealand is repeateldy proving they are best
Author
Hyderabad, First Published Nov 11, 2021, 12:31 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఒకప్పుడు ఐసీసీ ఈవెంట్లలో కివీస్ అడుగుపెడుతుందంటే  అది సెమీస్ స్టేజ్ కు వెళ్తే చాలు అనుకునేవాళ్లు. దానికి తగ్గట్టుగా ఆ జట్టు ప్రదర్శన కూడా అలాగే ఉండేది. జట్టు నిండా స్టార్లు.. ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నా మెగా టోర్నీలలో ఆ జట్టును దురదృష్టం వెంటాడేది. స్టీఫెన్ ఫ్లెమింగ్, క్రిస్ కెయిన్స్, నాథన్ ఆస్టిల్, మెక్మిలన్, మెక్ కల్లమ్, డేనియల్ వెటోరి, షేన్ బాండ్, రాస్ టేలర్.. ఇలా జాబితా పెద్దదే అయినా న్యూజిలాండ్ ఇంతవరకు వన్డే, టీ20 ప్రపంచకప్ గెలువలేదు. రెండుసార్లు ఫైనల్స్ కు చేరినా కప్పు దక్కలేదు. కానీ ప్రస్తుత సారథి.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ముద్దుగా కేన్ మామ అని పిలుచుకునే కేన్ విలిమయ్సన్ ఆ జట్టు తలరాతను మారుస్తున్నాడు. 

గత నాలుగైదేండ్లుగా ఆ జట్టు కేన్ మామ సారథ్యంలో  అన్ని ఫార్మాట్లలోనూ ఇరగదీస్తున్నది. 2019 వన్డే ప్రపంచకప్ లో అదృష్టం కలిసిరాకపోయినా.. ఈ ఏడాది జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు టీ20 ప్రపంచకప్ దక్కించుకోవడానికి ఒకే ఒక్క అడుగు  దూరంలో నిలిచాడు.  ఒకవేళ.. ఫైనల్లో కివీస్ గనక కప్పు గెలిస్తే.. ఎంఎస్ ధోని తర్వాత అన్ని ఫార్మాట్ల (వన్డే ప్రపంచకప్ మినహాయిస్తే) కప్పు గెలిచినవాడిగా రికార్డులకెక్కుతాడు. 

కొన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న కివీస్ జట్టు ప్రదర్శనకు 5 కారణాలను  ఒకసారి పరిశీలిద్దాం.. 

మూడు ఫార్మాట్లలోనూ సూపరే.. 

ఒక్క ఐసీసీ టోర్నీలే కాదు.. టెస్టులు, వన్డేలు, టీ20లలో కేన్ మామ జట్టు అద్భుతంగా రాణిస్తున్నది. 2015  వన్డే ప్రపంచకప్ లో బ్రెండెన్ మెక్ కల్లమ్ సారథ్యంలోని కివీస్.. ఫైనల్ లో బోల్తా కొట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకు సారథ్య బాధ్యతలు అందుకున్న విలియమ్సన్.. జట్టు దృక్పథాన్ని మార్చాడు. మరో నాలుగేళ్ల తర్వాత ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచకప్ లో కూడా కివీస్ ఫైనల్స్ కు చేరింది. అయితే ఇంగ్లాండ్ తో ముగిసిన ఆ మ్యాచ్ లో ఇరు జట్లు సమానమైన ప్రదర్శన చేసినా.. బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంతో కివీస్ కప్పుకు దూరమైంది. కానీ ఆ నిరాశను కివీస్ రెండేండ్లలోనే అధిగమించింది. ఈ ఏడాది జరిగిన తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో ఇండియాను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు అదే విజయాల పరంపరను కొనసాగిస్తూ.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది. 

ప్రపంచంలోనే ఉత్తమ ఫీల్డర్లు.. 

న్యూజిలాండ్ జట్టు  ముందు నుంచి మంచి ఫీల్డర్లున్న జట్టే అయినా కొద్దికాలంగా ఆ జట్టు ఆటగాళ్లు ఫీల్డింగ్ విన్యాసాలతో అలరిస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు అంత బాగా సఫలమవుతున్నారంటే కారణం  న్యూజిలాండ్ ఫీల్డర్లే. ఈ ప్రపంచకప్ లో కూడా ఆ జట్టు ఫీల్డర్ల  విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. డేరిల్ మిచెల్,  డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, నీషమ్, కేన్ విలియమ్సన్ లను దాటి బంతి మరో పక్కకు వెళ్లడం లేదు. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఫిలిప్స్ ఫీల్డింగ్ మరో లెవల్. ఇదే టోర్నీలో మిచెల్  క్యాచ్ విన్యాసాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. 

కేన్ మామ కెప్టెన్సీ.. 

ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో కేన్ విలియమ్సన్ ది ప్రత్యేక శైలి. ఛేదన సమయంలో  సంయమనంతో ఆడినా.. చేతిలో వికెట్లున్నప్పుడు విజృంభించినా..అది కేన్ మామకే చెల్లింది. ఆధునిక కాలంలో టెస్టు క్రికెట్ లో అత్యధిక  విజయాల శాతం ఉన్న  సారథి కూడా కేన్ విలియమ్సనే. గత వన్డే ప్రపంచకప్ నుంచి మొదలు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్.. టీ20 ప్రపంచకప్ దాకా  అతడు జట్టును నడిపించిన తీరు మెచ్చుకోదగినది. బ్యాటింగ్ లోనే గాక కెప్టెన్ గా పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలను రూపొందించుకుని వాటిని సరిగ్గా అమలు చేయడంలో కూడా కేన్ విజయం సాధిస్తున్నాడు. 

సౌథీ బౌలింగ్ దళం.. 

కివీస్ వెటరన్ టిమ్ సౌథీ సారథ్యంలోని బౌలింగ్ దళం ప్రపంచంలోని నెంబర్ వన్  పేస్ బౌలింగ్ యూనిట్ అనడంలో సందేహం లేదు. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. నీల్ వాగ్నర్.. కైల్ జెమీసన్.. లాకీ ఫెర్గూసన్.. మిల్నె వంటి పేసర్లతో పాటు ఇష్ సోధి.. మిచెల్ సాంట్నర్ వంటి స్పిన్నర్లు ఆ జట్టు బలం. 

వివాదాలకు జోలికి వెళ్లకుండా.. 

ఫార్మాట్  తో సంబంధం లేకుండా ఏ జట్టైనా మ్యాచ్  ముగిసిన తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లతో ఇట్టే కలిసిపోతారు. వివాదాలకు వాళ్లు దూరం. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం.. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోవడం వారికి తెలియదు. న్యూజిలాండ్ జట్టులో ప్రతి ఆటగాడు మ్యాచ్ ఫలితం ఏదైనా చిరునవ్వుతోనే కనిపిస్తారు. అందుకే ప్రత్యర్థి జట్లు బ్లాక్ క్యాప్స్ (న్యూజిలాండ్) కు అంత గౌరవమిస్తాయి.  ఆ జట్టులో క్రికెటర్లంతా డౌన్ టు ఎర్త్ ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios