ICC T20 World cup 2021: ప్రపంచంలోనే నెంబర్ వన్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మను కాదని టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ లో  ఐపీఎల్ అనుభవంతో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ను పంపించింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో భాగంగా టోర్నీలో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో టీమిండియా (Team India) దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం న్యూజిలాండ్ (Newzealand)తో జరిగిన ఆ మ్యాచ్ లో చిత్తుగా ఓడిన టీమిండియా (Team India).. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితికి వచ్చింది. న్యూజిలాండ్ పై ఓటమి నేపథ్యంలో జట్టు కూర్పుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో ముఖ్యమైనది రోహిత్ శర్మ (rohit Sharma) ను ఓపెనర్ గా కాకుండా మూడో స్థానంలో పంపడం. 

టీ20లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మను కాదని టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ లో ఐపీఎల్ (IPL) అనుభవంతో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) ను పంపించింది. రోహిత్ ను మూడో స్థానంలో పంపారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఈ వివాదంపై బారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ (Vikram Rathour) వివరణ ఇచ్చాడు. 

రాఠోడ్ మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు రోజు సూర్య కుమార్ యాదవ్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. అతడు మరుసటి రోజు జరిగే మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేదు. ఆ సమయంలో సూర్య స్థానాన్ని ఇషాన్ కిషన్ తో భర్తీ చేయాలనుకున్నాం. ఐపీఎల్ లో కూడా అతడు ముంబై ఇండియన్స్ తరఫున, గతంలో జాతీయ జట్టు తరఫున కూడా ఓపెనింగ్ చేశాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ అంతా కూర్చుని చర్చలు జరిపాం. ఈ చర్చల్లో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు’ అని అన్నాడు. 

ఇంకా అతడు స్పందిస్తూ.. ‘మేము లెఫ్ట్ హ్యాండర్ ను ఓపెనర్ గా పంపించాలని భావించాం. అప్పటికే మిడిలార్డర్ లో పంత్, జడేజా, కిషన్ లు ఎడం చేతి వాటం బ్యాటర్లే. అందుకే ఇషాన్ ను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపాడు. ఇదిలాఉండగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా తాను మళ్లీ దరఖాస్తు చేసుకున్నా అని రాఠోడ్ చెప్పాడు. అయితే దీనిపై బీసీసీఐ దే తుది నిర్ణయమని అన్నాడు.

ఇక న్యూజిలాండ్ తో మ్యాచ్ ముగిసి రెండ్రోజులు గడిచినా రోహిత్ ఓపెనింగ్ వివాదం మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది. అతడిని వన్ డౌన్ లో దించడం ద్వారా టీమ్ మేనేజ్మెంట్ పొరపాటు చేసిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. రోహిత్ సత్తాపై అతడికే సందేహాలు కల్పించే విధంగా ఈ నిర్ణయం ఉందన్నారు. ఇషాన్ కిషన్ ను నాలుగు లేదా ఐదో స్థానంలో దింపితే బాగుండేదని అన్నారు. గావస్కర్ తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే కూడా రోహిత్ వివాదంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీని ద్వారా మీరు (మేనేజ్మెంట్) ఏం సందేశం ఇస్తున్నారని అతడు ప్రశ్నించాడు.