New Zealand Vs Afghanistan: న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో  అఫ్గానిస్థాన్ పేలవ బ్యాటింగ్ తో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

టీ20 ప్రపంచకప్ లో రెండు దేశాల సెమీస్ ఆశలు మోస్తున్న అఫ్గానిస్థాన్.. కీలక పోరులో పేలవ బ్యాటింగ్ తో విఫలమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ గెలిచినా అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ.. బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపడం గమనార్హం. కీలక పోరులో అఫ్గాన్ బ్యాటర్ నజీబుల్లా జర్దాన్ రాణించాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (2), వికెట్ కీపర్ మహ్మద్ షెహజాద్ (4) లు కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేశారు. స్కోరు బోర్డుపై పది పరుగులు కూడా చేరకుండానే ఆ జట్టు ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. 

ఇన్నింగ్స్ మూడో ఓవర్లో షెహజాద్.. మిల్నె బౌలింగ్ లో కీపర్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా.. ఆ తర్వాతి ఓవర్లో టిమ్ సౌథీ జజాయ్ ను పెవిలియన్ కు పంపించాడు. ఆరో ఓవర్ తొలి బంతికి సౌథీ.. గుర్బాజ్ (6) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి అఫ్గాన్ 23-3 తో కష్టాల్లో పడింది. 

ఐదో నెంబర్ బ్యాటర్ గా క్రీజులోకి వచ్చిన నజీబుల్లా (48 బంతుల్లో 73.. 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. తొమ్మిదో ఓవర్ వేసిన నీషమ్ బౌలింగ్ లో రెండు ఫోర్లు బాదాడు. ఇక సాంట్నర్ వేసిన 14వ ఓవర్లో.. వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఇదే క్రమంలో 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20లలో ఇది అతడికి ఆరో అర్థ శతకం. 15 ఓవర్లు ముగిసేసరికి అఫ్గాన్ స్కోరు 91-4 గా ఉంది.

ఆఖర్లో నజీబుల్లా విశ్వరూపం చూపించాడు సౌథీ వేసిన 17వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టాడు. కానీ అదే ఓవర్ చివరి బంతికి అప్పటిదాకా అతడికి సహకారం అందించిన నబీ (14) ఔటయ్యాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ (2).. 7 బంతులాడి పరుగులు తీయడానికే ఇబ్బంది పడ్డాడు. ఆఖరు ఓవర్ వేసిన నీషమ్.. 2 పరుగులే ఇచ్చి రషీద్ ఖాన్ ను ఔట్ చేయడం కొసమెరుపు.

Scroll to load tweet…

ఇక కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి అఫ్గాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. 4 ఓవర్లు వేసిన ట్రెంట్ బౌల్ట్.. 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌథీకి 2 వికెట్లు దక్కాయి. మిల్నె, నీషమ్, సోధి పొదుపుగా బంతులేశారు. 

భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్న ఈ మ్యాచ్ లో అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేయడం ఇప్పుడు భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. బ్యాటింగ్ లో విఫలమైన నబీ సేన.. ఇప్పుడు బౌలింగ్ లో నైనా రాణిస్తుందో లేక కివీస్ బ్యాటర్లకు దాసోహమవుతుందో కొద్దిసేపట్లో తేలిపోతుంది.