India Vs namibia: విరాట్ కోహ్లి-రవిశాస్త్రి లు ఒక్క ఐసీసీ టోర్నీ గెలువకపోయినా.. తర్వాత వచ్చే కెప్టెన్- కోచ్ లు టీమిండియాకు ఆ వెలితి తీరుస్తారని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు.

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. నిన్న అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. దీంతో టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈ ప్రపంచకప్ లో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా పేలవ ప్రదర్శనపై భారత మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ స్పందించాడు. కోహ్లి-రవిశాస్త్రి లు ఒక్క ఐసీసీ టోర్నీ గెలవకపోయినా.. తర్వాత వచ్చే కెప్టెన్- కోచ్ లు భారత్ కు ఆ వెలితి తీరుస్తారని అభిప్రాయపడ్డాడు.

గంభీర్ మాట్లాడుతూ.. ‘రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ టోర్నీ గెలుస్తుందని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ ను ఆ జోడీ గెలుస్తుంది’ అని అన్నాడు. అంతేగాక ఇంగ్లాండ్ జట్టును ఆదర్శంగా తీసుకోవాలని గంభీర్ సూచించాడు. జట్టు కూర్పు, ఆల్ రౌండర్ల ఎంపిక, ఆటగాళ్ల పనితీరు.. ఇలాంటి విషయాల్లో ఆ జట్టు నెంబర్ వన్ గా ఉందని కొనియాడాడు.

టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు టీమిండియా.. నమీబియాను ఢీకొనబోతుంది. టీ20 సారథిగా కెప్టెన్ కోహ్లికి ఇదే ఆఖరు మ్యాచ్ కాగా.. కోచ్ గా కూడా రవిశాస్త్రికి ఇదే ఆఖరు మ్యాచ్. ఈ పోరు తర్వాత నవంబర్ 17 నుంచి మొదలయ్యే ఇండియా-న్యూజిలాండ్ సిరీస్ కు రాహుల్ ద్రావిడ్ కోచ్ (తాత్కాలిక) గా వ్యవహరించనున్నాడు. 

ఇది కూడా చదవండి : కథ ముగిసింది.. కల చెదిరింది.. కన్నీరే ఇక టీమిండియాకు మిగిలింది.. అఫ్గాన్, భారత్ ఇంటికి.. కివీస్ సెమీస్ కు..

ఇక ఈ సిరీస్ కు కెప్టెన్ ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా రోహిత్ శర్మ గానీ కెఎల్ రాహుల్ గానీ ఎంపికయ్యే అవకాశముంది. తీరికలేని షెడ్యూల్ కారణంగా రోహిత్ శర్మకు ఈ సిరీస్ లో విశ్రాంతినిచ్చినా.. తర్వాత మాత్రం అతడే రెగ్యులర్ కెప్టెన్ కానున్నడనేది బోర్డు వర్గాల మాట. 

కాగా.. 2013 లో ధోని సారథ్యం తర్వాత భారత్ ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలో గెలవలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని ధోని.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఆ తర్వాత టీమిండియా ఐసీసీ ఈవెంట్లకు వెళ్లడం.. సెమీస్, ఫైనల్స్ లో బొక్క బోర్లా పడటం ఆనవాయితీగా మారింది. 2014 టీ20 ప్రపంచకప్ లో ఫైనల్స్ లో ఓటమి.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో లో కూడా ఫైనల్ పరాజయం.. 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీస్ స్టేజ్ లో టీమిండియా ఇంటిముఖం పట్టింది. ఇక తదుపరి కెప్టెన్ గా భావిస్తున్న రోహిత్ శర్మ.. కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ కొరత తీరుస్తారని గంభీర్ అన్నాడు.