Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: రవిశాస్త్రి భావోద్వేగ స్పీచ్.. డ్రెస్సింగ్ రూమ్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ

Ravi Shastri: టీమిండియాకు ఐదేండ్లుగా కోచ్ బాధ్యతలు నిర్వర్తించిన రవిశాస్త్రి నిన్నటితో ఆ పదవికి గుడ్ బై చెప్పేశాడు. ఈ సందర్భంగా నమీబియా తో  మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లతో భావోద్వేగంగా మాట్లాడాడు.

ICC T20 World Cup 2021: Ravi Shastri Emotional speech after his last match as Coach, BCCI Shares Video
Author
Hyderabad, First Published Nov 9, 2021, 1:46 PM IST

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా సుమారు ఐదేళ్లపాటు సేవలందించిన రవిశాస్త్రి (Ravi Shastri) నిన్నటితో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. భారత క్రికెట్ జట్టు (Team India) సారథి విరాట్ కోహ్లి (Virat Kohli)కి కూడా టీ20 ఫార్మాట్ లో టీమిండియా తరఫున ఆఖరు మ్యాచ్ ఆడేశాడు. ఈ ఇద్దరూ కలిసి భారత క్రికెట్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే  శిక్షకుడిగా తన ఆఖరు మ్యాచ్ ముగిశాక రవిశాస్త్రి.. టీమిండియా ఆటగాళ్లకు ప్రేరణ కల్పించే ప్రసంగం చేశాడు. కోచ్ గా ఆఖరు మ్యాచ్ కావడంతో శాస్త్రి భావోద్వేగానికి లోనయ్యాడు. 

వీడియోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ఒక జట్టుగా మీరు నా అంచనాలను మించి ఆడారు. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా.. అన్ని ఫార్మాట్లాలోనూ అన్ని జట్లను మట్టి కరిపించారు. అదే మిమ్మల్ని ప్రపంచంలో  గొప్ప జట్టుగా నిలిచింది. అన్ని ఫార్మాట్లలో మీరు ఆడిన ఆట.. భవిష్యత్తులో కూడా కొనసాగించాలి’ అని అన్నాడు. అనంతరం ఆటగాళ్లందరూ రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. పలువురు ఆటగాళ్లు రవిశాస్త్రితో పాటు అతడి సహాయక సిబ్బంది భరత్ అరుణ్, శ్రీధర్ లను హత్తుకుని వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  

ఇక ప్రస్తుత ప్రపంచకప్ (T20 World cup 2021) లో భారత నిష్క్రమణ గురించి కూడా శాస్త్రి స్పందించాడు. ‘అవును.. ఇది మనకు గొప్ప టోర్నమెంటు కాలేదు. మనం ఒకటో రెండో ఐసీసీ టోర్నీలు గెలవాల్సింది. కానీ అలా జరుగులేదు. అలా అని చింతించాల్సిందేమీ లేదు. ఇది ఆట.. ఇందులో మీకు మరో అవకాశం దక్కుతుంది. అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకుని విజయవంతం కావడానికి మీరు తెలివిగా, అనుభవజ్ఞులై ఉండాలి. నావరకైతే జీవితంలో ఏమి సాధించామన్నది కాదు.. అడ్డంకులను ఎలా అధిగమించామన్నదే ముఖ్యం’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: మా ఓటమికి అదొక్కటే కారణం, లేదంటేనా... కోచ్‌గా ఆఖరి మ్యాచ్‌కి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యలు...

ఇదిలాఉండగా నిన్న నమీబియా తో మ్యాచ్ కు ముందు రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘డ్రెస్సింగ్ రూమ్ కు దూరమవుతున్నందుకు భావోద్వేగానికి లోనవుతున్నా. కానీ గర్వంగా నిష్క్రమిస్తున్నా. నేను కోచ్ గా మారేందుకు శ్రీనివాసనే (BCCI మాజీ అధ్యక్షుడు) కారణం. నాపై నాకంటే ఆయనే ఎక్కువ నమ్మకముంచారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ జట్లలో ఇదొకటి. ఐసీసీ ట్రోఫీ ఒకటి లోటుగా ఉండింది.  కానీ కొత్త హెడ్ కోచ్ ద్రవిడ్,  రోహిత్ శర్మ (ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) నేతృత్వంలో అది దక్కాలని కోరుకుంటున్నా.. కెప్టెన్ గా రోహిత్ శర్మ అన్ని విధాలా సమర్థుడు..’ అని చెప్పాడు.

 

బయో బబుల్ గురించి.. 

టీ20 ప్రపంచకప్ లో భారత పేలవ ప్రదర్శనకు ఒక కారణంగా  విమర్శలు వస్తున్న బయో బబుల్ గురించి రవిశాస్త్రి స్పందించాడు. అయితే బయో బబుల్ లో ప్రఖ్యాత  క్రికెట్ దిగ్గజం.. ఆసీస్ దివంగత క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ ఉన్నా ఆయన బ్యాటింగ్ సగటు కూడా తగ్గుతుందని  చెప్పాడు అయితే ఇది ఎప్పటికీ శాశ్వతం కాదని, త్వరలోనే లేక కొద్దికాలానికో బయో బబుల్ పీడ విరగడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు మానసిక విశ్రాంతి కోసం బీసీసీఐ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా..? అన్న ప్రశ్నకు సమాధానంగా. ‘అది నా పని కాదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద టోర్నీలు నిర్వహించేప్పుడు వాటి మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆటగాళ్లు మానసిక విశ్రాంతి తీసుకుంటారు..’ అని అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios