Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: సెమీస్ రేసులో మరింత ముందుకు కివీస్.. స్కాట్లాండ్ పోరాటం అదుర్స్..

NZ vs SCO: స్కాట్లాండ్ తో జరిగిన గ్రూప్-2 మ్యాచ్ లో న్యూజిలాండ్.. ఆ జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. 20 ఓవర్లు ఆడిన ఆ జట్టు.  156 పరుగుల వద్దే ఆగిపోయింది. బ్యాటింగ్ లో ఇరగదీసి తృటిలో సెంచరీ కోల్పోయిన కివీస్ ఓపెనర్  మార్టిన్ గప్తిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

ICC T20 World cup 2021: NZ vs SCO Newzealand beats scotland by 16 Runs
Author
Hyderabad, First Published Nov 3, 2021, 7:09 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో  సెమీస్ రేసులో పోటీ పడుతున్న న్యూజిలాండ్ (Newzealand).. ఆదిశగా మరో అడుగు ముందుకేసింది. అబుదాబి వేదికగా  స్కాట్లాండ్ (Scotland) తో జరిగిన గ్రూప్-2 మ్యాచ్ లో న్యూజిలాండ్.. ఆ జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. 20 ఓవర్లు ఆడిన స్కాట్లాండ్.. 156 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో పాక్ చేతిలో ఓడిన న్యూజిలాండ్.. ఆ తర్వాత  టీమిండియా(Team India) ను చిత్తు చేసింది. ఇక ఇప్పుడు  స్కాట్లాండ్ ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని అందుకోవడమే గాక సెమీస్ రేసులో మరింత ముందుకు సాగింది. బ్యాటింగ్ లో ఇరగదీసి తృటిలో సెంచరీ (93) కోల్పోయిన కివీస్ ఓపెనర్  మార్టిన్ గప్తిల్  (Martin guptill)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

173 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన స్కాట్లాండ్ కు కెప్టెన్ కొయెట్జర్ (11 బంతుల్లో 17.. 4 ఫోర్లు), జార్జ్ మున్సే (18 బంతుల్లో 22.. 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగానే ఆరంభించారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే కోయెట్జర్.. రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత టిమ్  సౌథీ బౌలింగ్ లో కూడా ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ మూడో ఓవర్లో బౌల్ట్ వేసిన బౌన్సర్ ను సౌథీ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి పవర్ ప్లే ముగిసేసరికి స్కాట్లాండ్ స్కోరు 28-1. 

కొయెట్జర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్.. ఆరో ఓవర్ వేసిన మిల్నేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో క్రాస్.. వరుసగా ఐదు బంతులను బౌండరీ లైన్ దాటించాడు.   దీంతో ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. ఏడో ఓవర్ వేసిన స్పిన్నర్ ఇష్ సోధి బౌలింగ్ లో మున్సే.. రెండు  బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. తొలి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన అతడు.. రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. కానీ తర్వాత బంతికే సౌథీ రన్నింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఈ క్రమంలో స్కోరు బోర్డు వేగం కూడా నెమ్మదించింది.

 

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 76 పరుగుల చేసి లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కనిపించిన స్కాట్లాండ్ కు సౌథీ చెక్  పెట్టాడు.  11 ఓవర్లో క్రాస్ ను బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే వచ్చిన బెర్రింగ్టన్ (17 బంతుల్లో 20) ఒక సిక్సర్.. ఫోర్ కొట్టి జోరు మీదే కనిపించినా ఇష్ సోధి  బౌలింగ్ లో కీపర్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాక్లాయిడ్ (12) ను బౌల్ట్ బౌల్డ్ చేశాడు. 16 ఓవర్లకు  స్కాట్లాండ్ స్కోరు 108-5. 

ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన లీస్క్ (20 బంతుల్లో 42.. 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులుమెరిపించాడు. ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ అప్పటికే సాధించాల్సిన లక్ష్యం ఎక్కువవడంతో లీస్క్ శ్రమకు ఫలితం దక్కుండా పోయింది. సోధి వేసిన 18వ ఓవర్లో లీస్క్.. ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది స్కాట్లాండ్ శిబిరంలో ఆశలు రేపాడు. 

కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ  ఫర్వాలేదనిపించారు. బౌల్ట్ కు 2 వికెట్లు దక్కగా.. స్పిన్నర్ సోధి కి 2 వికెట్లు పడ్డాయి. టిమ్ సౌథీకి వికెట్ దక్కింది. తాజా విజయంతో న్యూజిలాండ్ కు నాలుగు పాయింట్లు దక్కాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios