Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: తస్మాత్ జాగ్రత్త..! అఫ్గాన్ ను తేలికగా తీసుకుంటే అంతే.. టీమిండియాకు టర్బోనేటర్ హెచ్చరిక

Harbhajan warns Team India: అఫ్గాన్ ను తేలికగా తీసుకోవద్దని, తమదైన రోజున ఆ జట్టు ఎంత పెద్ద జట్టుకైనా షాక్ ఇవ్వగలదని భారత మాజీ  స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించాడు. ఆ జట్టు అద్భుత ఫామ్ లో ఉన్నదన్న విషయాన్ని మరువకూడదని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ICC T20 World cup 2021: India cannot take afghanistan lightly warns harbhajan singh
Author
Hyderabad, First Published Nov 3, 2021, 4:25 PM IST

టీ20 ప్రపంచకప్  (T20 World cup) టోర్నీలో  ఇప్పటికే అడుగంటిన సెమీస్ అవకాశాలను సజీవంగా బతికించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నేటి సాయంత్రం టీమిండియా (Team india).. అఫ్గనిస్థాన్ (Afghanistan) ను ఢీ కొనబోతున్నది. అయితే ఈ నేపథ్యంలో అఫ్గాన్ (Afghan) ను తేలికగా తీసుకోవద్దని, తమదైన రోజున ఆ జట్టు ఎంత పెద్ద జట్టుకైనా షాక్ ఇవ్వగలదని భారత మాజీ  స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan singh) హెచ్చరించాడు. ఆ జట్టు అద్భుత ఫామ్ లో ఉన్నదన్న విషయాన్ని మరువకూడదని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. 

హర్భజన్ మాట్లాడుతూ.. ‘అఫ్గాన్ ను లైట్ తీసుకోవద్దు. వాళ్లు మంచి పరిణితి సాధించిన జట్టు. మెరుగైన బ్యాటర్లు, నాణ్యమైన బౌలర్లు ఆ జట్టు సొంతం. ఇక  స్పిన్ ద్వయం ముజీబ్ రెహ్మాన్-రషీద్ ఖాన్ లు ఎప్పుడైనా ప్రమాదకరమే’ అని అన్నాడు. భారత బ్యాటర్లు  ఆ స్పిన్ ద్వయాన్ని సమర్థంగా ఎదుర్కుంటేనే విజయం సొంతమవుతుందని చెప్పాడు. 

ఇంకా హర్భజన్ స్పందిస్తూ.. ‘టీ20 ఫార్మాట్ లో ఏ జట్టు గెలుస్తుంది..?  ఏ జట్టు ఓడుతుంది..? అని అంచనా వేయడానికి వీళ్లేదు. మొదటి ఆరు ఓవర్ల తర్వాత ఏ జట్టు అయితే పటిష్ట స్థితిలో ఉంటే వాళ్లకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది.  కావున జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’ అని అన్నాడు. 

గతంలో టీ20  ప్రపంచకప్ టోర్నీలలో భారత్ తో అఫ్గాన్ జట్టు రెండుసార్లు తలపడగా ఆ రెండింటిలోనూ టీమిండియానే విజయం వరించింది. అయితే గత రికార్డులు వేరు,  ప్రస్తుత ఆట వేరని అన్నాడు. ఆ రోజున ఎవరైతే బాగా ఆడతారో వాళ్లే విజయం సాధిస్తారని చెప్పాడు. 

‘ఒక క్రికెటర్ గా నేను గత రికార్డుల గురించి పట్టించుకోను. గణాంకాలనేవి పనికిరానివి. గతంలో ఏ జరిగిందో అదే జరుగుతుందని మనం అంచనా వేయలేం. ఒకవేళ అదే నిజమైతే.. 12 సార్లు భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్థాన్ మొన్న మనను ఓడించలేదా..? గతాన్ని మనం మార్చలేం. కానీ ఇప్పుడెలా ఆడుతున్నామనేదే ముఖ్యం. గతంలో భారత్.. అఫ్గాన్ ను ఓడించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది చిన్న జట్టు ఎంత మాత్రమూ కాదు. వాళ్లు ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించారు. పెద్ద జట్లనూ ఓడించగల సత్తా వాళ్లలో ఉంది’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. 

ఇదిలాఉండగా.. నేటి మ్యాచ్ లో ఇండియాను ఓడిస్తామని అఫ్గాన్ ఫాస్ట్ బౌలర్ హమీద్ హసన్ (Hamid Hasan) అన్నాడు. అతడు మాట్లాడుతూ.. ‘ఇండియాపై ఒకవేళ మేము ఎక్కువ స్కోరు చేయగలిగితే మేము దానిని కాపాడుకోగలం (బౌలింగ్ తో..). అయితే అది మా చేతుల్లో లేదు. వికెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మా ప్రణాళికలు ఎలా వర్కవుట్ అవుతాయో చూడాలి. ఆటకు ముందు ఏం చెప్పడానికి లేదు. కానీ మేం వంద శాతం ప్రయత్నిస్తాం’ అంటూ వ్యాఖ్యానించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios