Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: తప్పు చేశా.. క్షమించండి.. ఫ్యాన్స్ ను బహిరంగంగా క్షమాపణ కోరిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్

Hassan Ali: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కు కప్పు దూరం చేశాడని భావిస్తున్న హసన్ అలీ పై ఆ దేశపు అభిమానులు  ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో అయితే అలీ పై పాక్ అభిమానులు ఓ చిన్న సైజు యుద్ధమే నడిపారు.  ఈ సంగ్రామలో అలీ భార్య సయామీ కూడా బాధితురాలిగా మారింది.

ICC T20 World Cup 2021: Hassan Ali apologies to Fans after Pakistan lost semifinals against Australia
Author
Hyderabad, First Published Nov 14, 2021, 1:11 PM IST

ప్రపంచకప్ లో అంచనాలేమీ లేకుండా వచ్చి వరుస విజయాలతో ట్రోఫీ నెగ్గుతుందని భావించిన దశలో పాకిస్థాన్ అనూహ్యంగా సెమీస్ లో ఓటమిపాలైంది.  ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టాయినిస్, మాథ్యూ వేడ్  ల విరోచిత ఇన్నింగ్స్  తో పాకిస్థాన్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఆసీస్ విజయానికి వేడ్, స్టాయినిస్ లు ఎంత  కీలక పాత్ర పోషించారో..  పాకిస్థాన్ ఓటమిలో కూడా ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉందనేది మ్యాచ్ చూసినవారికి ఎవరికైనా తెలుస్తుంది. వారే పాకిస్థాన్ స్టార్ బౌలర్లు హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది. 19వ ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ ను హసన్ అలీ నేలపాలు చేయడం.. ఆ తర్వాత మూడు బంతుల్లోనే వేడ్ వరుస సిక్సర్లతో ఆసీస్ విజయాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం హసన్ అలీ పై పాకిస్థాన్ అభిమానులు  ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో అయితే అలీ పై పాక్ అభిమానులు ఓ చిన్న సైజు యుద్ధమే నడిపారు.  ఈ సంగ్రామలో అలీ భార్య సయామీ కూడా బాధితురాలిగా మారింది. 

గడిచిన మూడు రోజులుగా పాక్ అభిమానులు.. అలీ, అతడి భార్యపై సైబర్ దాడి కొనసాగిస్తున్న నేపథ్యంలో అతడు స్పందించాడు.  ఫ్యాన్స్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.  అభిమానుల అంచనాలు అందుకోవడంలో తాను దారుణంగా విఫలమయ్యానని వాపోయాడు. కానీ తాను మాత్రం ఈ ఓటమి నుంచి చాలా నేర్చుకున్నానని, ఇకపై ఉత్తమ ప్రదర్శన చేస్తానని పేర్కొన్నాడు. 

 

ఆసీస్ తో మ్యాచ్ అనంతరం తనపై సైబర్ దాడి జరిగినా  ఒక్క మాట కూడా మాట్లాడని అలీ.. నిన్న రాత్రి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘మీరంతా నా ప్రదర్శన పట్ల నిరాశ చెందారని నాకు తెలుసు. మీ అంచనాలను నేను  అందుకోలేకపోయాను. కానీ మీకంటే నేను ఎక్కువగా బాధపడ్డాను. అయితే నా మీద అంచనాలను మాత్రం తగ్గించకండి. పాకిస్థాన్ క్రికెట్ కు అత్యుత్తమ స్థాయిలో సేవలందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.  అందుకోసం నేను తీవ్రంగా శ్రమిస్తాను. ఈ ఓటమి నన్ను మరింత ధైర్యవంతుడిగా తయారుచేసింది. ఇంత క్లిష్ట సమయంలో నాకు తోడుగా నిలిచి మెసేజ్ లు, ట్వీట్ లు, కాల్స్ చేసిన వారందరికీ ధన్యవాదాలు..’ అంటూ ట్వీట్ చేశాడు. 

అలీ పై సైబర్ దాడి నేపథ్యంలో పలువురు పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు  భారత మాజీ క్రికెటర్లు కూడా అతడికి మద్దతుగా నిలిచారు.  ఉపఖండపు దేశాల్లో క్రికెటర్లకు ఇటువంటి అనుభవాలు తప్పవని, అన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని అలీకి సూచించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios