Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: ప్రపంచ ఛాంపియన్ల సమరం.. ఎవరిని వరించేనో విజయం.. నేడే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ తొలి సెమీస్

England Vs New Zealand: సూపర్-12 మాదిరిగా ఒక మ్యాచ్ పోతే మరో మ్యాచ్ చూసుకుందాం అంటే కుదరదు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ పోరులో పోటీ పడే అవకాశం ఉంటుంది. గెలిస్తే ఫైనల్ కు.. ఓడిన జట్టు ఇంటికే. మరి తొలి సెమీస్ లో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా..?

ICC T20 World Cup 2021: Eng vs Nz Will Newzealand Take Revange on England Tonight in first Semis
Author
Hyderabad, First Published Nov 10, 2021, 12:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రెండు జట్లూ ఛాంపియన్లే. ఒకటి రెండేండ్ల కింద ప్రపంచకప్ నెగ్గగా.. మరో జట్టు ఏడాది క్రితమే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నెగ్గింది. ఆఖరుసారి ఈ రెండు జట్ల మధ్యే వన్డే ప్రపంచకప్ జరిగింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠగా సాగిన ఆ పోరులో అదృష్టం బ్రిటీష్ జట్టునే వరించింది. కానీ ఈ సారి మాత్రం అలా కానివ్వమంటున్నది కివీస్. పటిష్ట ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య నేడు అబుదాబిలో కీలక సమరం జరుగనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం సాయంత్రం తొలి సెమీస్ జరుగనున్నది. సూపర్-12 మాదిరిగా ఒక మ్యాచ్ పోతే మరో మ్యాచ్ చూసుకుందాం అంటే కుదరదు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ పోరులో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఓడిన జట్టు ఇంటికే. గత ప్రపంచకప్  ఫైనల్ మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆరాటపడుతున్న న్యూజిలాండ్.. ఈ టోర్నీలో అదరగొడుతున్న ఇంగ్లాండ్ మధ్య  జరుగనున్న తొలి సెమీస్ పోరు ఆసక్తికరంగా మారనున్నది. 

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో  మొన్న భారత్-నమీబియా మ్యాచ్ తో గ్రూప్ దశకు ముగింపు పడింది. ఇక నేటి నుంచి సెమీస్ పోరు. నాలుగు జట్లు ఈ పోరులో తలపడుతుండగా.. గెలిచిన రెండు జట్లు ఫైనల్ లో తలపడుతాయి.  ఈ మేరకు తొలి సెమీస్ లో భాగంగా బుధవారం  సాయంత్రం 7:30 గంటల నుంచి కేన్ విలియమ్సన్  సారథ్యంలోని న్యూజిలాండ్.. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. 2010లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుని ఆ తర్వాత రెండో ప్రపంచకప్ వేటలో ఇంగ్లాండ్ ఉండగా.. తొలి ప్రపంచకప్ కోసం కివీస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. టీ20లలో కివీస్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైనల్స్ కు వెళ్లలేదు.

ఇరు జట్లూ పటిష్టమే..: 

బలాబలాలు చూస్తే రెండు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగానే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్లు, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లున్నారు. ఇక  టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం నుంచి దూకుడు మీదున్న ఇంగ్లాండ్.. గ్రూప్ దశలో ఐదు మ్యాచుల్లో చివరి మ్యాచ్ ఓడింది. మరోవైపు కివీస్.. తొలి మ్యాచ్  లో ఓడి.. తర్వాత నాలుగు మ్యాచులు గెలుచుకుంది.  సెమీస్ పోరుకు ముందు ఓపెనర్ జేసన్ రాయ్, పేసర్ మిల్స్ గాయపడటం ఇంగ్లాండ్ కు దెబ్బే కానీ వారి లేని లోటును పూడ్చే ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. బట్లర్, బెయిర్ స్టో, మలన్, మోర్గాన్ లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. స్పిన్నర్ అలీ కూడా బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు.  ఇక బౌలింగ్ విషయానికొస్తే.. వోక్స్, మార్క్వుడ్, జోర్డాన్  పేస్ తో రాణిస్తుండగా.. అలీ, రషీద్ లు  తమ స్పిన్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఆఖరు ఓవర్లలో బౌలర్లు లయ కోల్పోవడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తున్నది. 

ఇక ఇంగ్లాండ్ మాదిరే కివీస్ కు కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మార్టిన్ గప్తిల్, మిచెల్, కేన్ విలియమ్సన్ లు టాపార్డర్ లో అదరగొడుతుండగా.. నీషమ్, ఫిలిప్స్ లు ఆఖర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. కెప్టెన్ విలియమ్సన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నాడు. అయితే నేటి పోరులో వీళ్లంతా ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. బౌలింగ్ లో కివీస్ జట్టు బలంగా ఉంది. టిమ్ సౌథీ నేతృత్వంలోని బౌలింగ్ దళమే న్యూజిలాండ్ ప్రధాన ఆయుధం. ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నాడు. మిల్నె కూడా అదరగొడుతున్నాడు. ఇక స్పిన్నర్లు ఇష్ సౌధీ, మిచెల్ సాంట్నర్ లు  యూఏఈ పిచ్ లపై స్పిన్ ను రాబడుతున్నారు. బౌలర్లు విజృంభిస్తే ఇంగ్లాండ్ కు కష్టాలు తప్పవు.   

పిచ్ పరిస్థితి.. 

అబుదాబి పిచ్ మొదట్లో పేసర్లకు సహకరిస్తూ తర్వాత బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో బంతికి.. బ్యాట్ కు  రసవత్తర పోరు ఖాయం. రాత్రి పూట మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్ లో మంచు కురుస్తున్నది. ఇది ఛేదన చేసేవారికి అనుకూలించే అవకాశమే ఎక్కువ. దీంతో టాస్ గెలిచిన జట్టు  తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశమే ఉంది. 

గత మ్యాచులలో ఫలితాలు.. 

పేపర్ మీద ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నా.. టోర్నీలో రెండు జట్ల ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నా చరిత్ర మాత్రం ఇంగ్లాండ్ కే అనుకూలంగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 21 టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో ఇంగ్లాండ్ దే పై చేయిగా ఉంది. 21 లో.. 7 మాత్రమే కివీస్ గెలవగా.. ఇంగ్లాండ్ 12  మ్యాచుల్లో విజయం సాధించింది. రెండింటిలో ఫలితం రాలేదు. ఇక టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ఇప్పటివరకు అయిదుసార్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లాండ్ 3.. న్యూజిలాండ్ 2 మ్యాచుల్లో గెలిచాయి. 

2019 ప్రపంచకప్ ఫైనల్.. 

ఈ మధ్య కాలంలో ఈ రెండు జట్లు పెద్దగా ముఖాముఖి తలపడలేదు. కానీ రెండు జట్ల మధ్య పోరు అంటే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే గుర్తొస్తుంది. ఆ మ్యాచులో రెండు జట్లు సమానంగా స్కోర్లు (న్యూజిలాండ్ -241-8.. ఇంగ్లాండ్ 241-10) చేశాయి. దీంతో ఇది సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో కూడా రెండు జట్లు 15 పరుగులే చేశాయి. మ్యాచ్ మళ్లీ టై అయింది. దీంతో ఇన్నింగ్స్ లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ ను విశ్వ విజేతగా ప్రకటించారు. ఫలితంగా ఇంగ్లాండ్ తొలి ప్రపంచకప్ అందుకోగా.. న్యూజిలాండ్ గుండె పగిలింది. ఇక రెండేండ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో రెండు జట్లూ మళ్లీ తలపడుతుండటంతో.. కివీస్ నాటి ఫలితానికి పరాజయం తీర్చుకుంటుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. 

జట్లు అంచనా: 

న్యూజిలాండ్: గప్తిల్, మిచెల్, విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, ఫిలిప్స్, నీషమ్, మిచెల్  సాంట్నర్, ఇష్ సోధి, మిల్నె, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్

ఇంగ్లాండ్: బట్లర్, బెయిర్ స్టో,  మోయిన్ అలీ, మలన్, మోర్గాన్ (కెప్టెన్), లివింగ్ స్టోన్, బిల్లింగ్స్, రషీద్, వోక్స్, మార్క్వుడ్, జోర్డాన్ 

Follow Us:
Download App:
  • android
  • ios